భారత్ కు ఇజ్రాయెల్ పోరు దెబ్బ ? ఎన్నికల వేళ చమురు మంట, రూపాయి పతనం భయాలు ?
ఇజ్రాయెల్ పై పాలస్తీనా తీవ్రవాద సంస్ధ హమాస్ మొదలుపెట్టిన మెరుపుదాడులు ఆ తర్వాత ఇరుదేశాల మధ్య యుద్ధంగా మారుతున్న నేపథ్యంలో ఈ ప్రభావం పొరుగుదేశాలపైనా పడుతోంది. అంతేకాదు ఏదో విధంగా ఈ రెండుదేశాలతో సంబంధం ఉన్న దేశాలపైనా ఈ ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లను శాసించే చమురు ధరలు, దేశీయ ద్రవ్యోల్పణం, కరెన్సీ విలువ పతనాలు కూడా తప్పేలా లేవు.
ఇజ్రాయెల్-హమాస్ మధ్య సాగుతున్న పోరు భారత్ లో చమురు ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు.అసలే సార్వత్రిక ఎన్నికలకు సిద్దమవుతున్న వేళ భారత్ లో చమురు ధరలు పెరిగితే ఆ ప్రభావం అధికారంలో ఉన్న పార్టీలపై తప్పకుండా ఉంటుంది. ఎన్నికలకు ముందు ప్రభుత్వం రిటైల్ ఇంధన ధరలను నియంత్రించే అవకాశం ఉన్నప్పటికీ, హోల్ సేల్ చమురు ధరలు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇజ్రాయెల్-పాలస్తీనా పోరుతో అంతర్జాతీయంగా చమురు ఉత్పత్తి, రవాణాపై ప్రభావం పడితే భారత్ కు దిగుమతులు భారంగా మారడం ఖాయం. అప్పుడు దిగుమతుల బిల్లు రూపాయిపై ఒత్తిడిని పెంచడం ఖాయమని నిపుణులు చెప్తున్నారు. తాజాగా బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు సోమవారం 3 శాతం పైగా పెరిగాయి. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లు ఒత్తిడికి లోనవుతున్నప్పటికీ, పెట్టుబడిదారులు నష్టాలకు దూరంగా ఉండటం, బంగారం వంటి సురక్షితమైన స్వర్గధామ ఆస్తులకు తరలివెళ్లడంతో బ్యారెల్‌కు 87 డాలర్లు దాటింది.
ఇజ్రాయెల్, హమాస్ పోరు విస్తృతం కానుందనే భయాలతో స్టాక్ మార్కెట్లు ఇప్పటికే వణుకుతున్నాయి. అసలే యూరప్ , చైనాలో ఆర్ధిక అనిశ్చితి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ యుద్ధంతో చమురు ధరలు ఆకాశాన్ని అంటితే ఆ ప్రభావం రూపాయి విలువపై కచ్చితంగా పడటం ఖాయం. ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 90 డాలర్లు దాటితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో పాటు భారతదేశానికి కూడా ఇబ్బందులు తప్పవని అంచనా.
పాలస్తీనా చర్యల వెనుక ఇరాన్ ఉందన్న ప్రచారం ఇప్పుడు సముద్ర మార్గాల్ని ప్రభావితం చేయబోతోంది. ఇది అంతర్జాతీయంగా రవాణా, బీమా ఖర్చులను పెంచుతుంది. అధిక క్రూడ్ ధరలు మన వాణిజ్య బ్యాలెన్స్, కరెంట్ ఖాతా లోటు లెక్కల్ని మార్చడం ఖాయం. తద్వారా రూపాయిపై ఒత్తిడి పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. వచ్చే నెలలో ఐదు రాష్ట్రాల ఎన్నికలతో పాటు వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్న బీజేపీకి తాజా పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి.












Click it and Unblock the Notifications