Kaali: అమ్మవారి నోట్లో సిగరెట్: ఫిల్మ్‌మేకర్ చుట్టూ ఉచ్చు: రంగంలో ఐఎఫ్ఎస్ఓ
ముంబై: ఫిల్మ్‌మేకర్ లీనా మణిమేఖలై చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఆమెను అరెస్ట్ చేయాలనే డిమాండ్ ఊపందుకుంటోన్న వేళ.. పలు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. హిందు ధార్మిక సంఘాల ప్రతినిధులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు పోలీసులు లీనాపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నోటీసులు జారీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాళి పేరుతో ఆమె రూపొందిస్తోన్న డాక్యుమెంటరీ ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ వివాదానికి కారణమైంది.

అమ్మవారి నోట్లో సిగరెట్..
కాళిక అమ్మవారు సిగరెట్ తాగుతున్నట్టు దీన్ని డిజైన్ చేశారు. ఓ చేత్తో త్రిశూలం, మరో చేత్తో స్వలింగ సంపర్కుల సమాజానికి గుర్తుగా ఉపయోగించే జెండాను పట్టుకుని కనిపించారు. ఈ పోస్టర్ ట్విట్టర్‌లో పోస్ట్ అయిన కొద్ది సేపటికే వైరల్‌గా మారింది. నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. కోట్లాదిమంది హిందువుల మనోభావాలతో ఫిల్మ్ మేకర్ మణిమేఖలై ఆటలాడుతున్నారంటూ మండిపడుతున్నారు ట్విట్టరెటీలు. ఆమెను ట్రోల్ చేయడం మొదలు పెట్టారు.
అరెస్ట్ కోసం డిమాండ్..
ట్విట్టర్‌లో #ArrestLeenaManimekalai అనే హ్యాష్‌ట్యాగ్ ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉంది. మణిమేఖలపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాలకు వాటిని ట్యాగ్ చేస్తోన్నారు. లీనాపై గో మహాసభ చీఫ్ అజయ్ గౌతమ్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖకూ ఫిర్యాదు పత్రాన్ని పంపించారు. లీనాపై వెంటనే ఎఫ్ఐఆర్‌ను నమోదు చేయాలని, ఆమెను అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు.

రంగంలో ఐఎఫ్ఎస్ఓ
కాళి పేరుతో రూపుదిద్దుకుంటోన్న డాక్యుమెంటరీ వెంటనే నిషేధించేలా చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులకు విజ్ఞప్తి చేశారు. దీనితో ఢిల్లీ ఇంటెలిజెన్స్ ఫ్యూషన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ (ఐఎఫ్ఎస్ఓ) యూనిట్ అధికారులు లీనాపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐపీసీలోని సెక్షన్ 153ఏ, 295ఏ కింద మణిమేఖలైపై కేసు పెట్టారు. ఆల్ట్ న్యూస్ కో-ఫౌండర్ మహ్మద్ జుబేర్‌ను అరెస్ట్ చేసింది ఈ విభాగమే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

యూపీలోనూ..
అటు ఉత్తర ప్రదేశ్‌లో కూడా పలు పోలీస్ స్టేషన్లలో లీనా మణిమేఖలైపై కేసులు నమోదయ్యాయి. హిందువుల మనోభావాలను దెబ్బతీయడం, ఉద్దేశపూరకంగా శాంతియుత పరిస్థితులను భగ్నం చేయడానికి ప్రయత్నించడం, మతాన్ని కించపరచడం.. వంటి పలు సెక్షన్ల కింద ఆమెపై కేసు పెట్టారు. లక్నోలోని హజ్రత్ గంజ్ పోలీస్ స్టేషన్‌లో- ఐపీసీలోని సెక్షన్ 120-బీ, 153-బీ, 295, 295-ఏ, 298, 504, 505 (1) (బీ)తో పాటు ఐటీ యాక్ట్‌లోని సెక్షన్లు 66, 67 కింద కేసులు నమోదయ్యాయి.












Click it and Unblock the Notifications