జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ అరెస్టుకు రంగం సిద్ధం ? పీఠంపై భార్య కల్పన !
జార్ఖండ్ లో రూ.600 కోట్ల భూకుంభకోణంలో చిక్కుకున్న సీఎం హేమంత్ సోరెన్ ను అరెస్టు చేసేందుకు ఈడీ సిద్ధమవుతోంది. ఇప్పటికే ఐదుసార్లు నోటీసులు జారీ చేసి ఓసారి విచారణ కూడా చేసిన ఈడీ.. తాజాగా మరోసారి విచారణకు హాజరు కాకుండా తప్పించుకున్న హేమంత్ సోరెన్ కు మరోసారి నోటీసులు చేసింది. రేపు విచారణకు హాజరు కావాలని కోరింది. అయితే ఈ విచారణ తర్వాత సోరెన్ ను అరెస్టు చేసేందుకు ఈడీ రంగం సిద్ధం చేస్తోంది.
ఇప్పటికే భూకుంభకోణంలో విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులు జారీ చేయడంతో సోరెన్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన కోసం గాలింపు చేపట్టిన ఈడీ అధికారులు ఢిల్లీ పోలీసుల సాయం కూడా కోరారు. దీంతో హేమంత్ సోరెన్ అరెస్టు తథ్యమని తేలిపోయింది. అయితే తాజాగా సోరెన్ కు మరోసారి నోటీసులు జారీ చేసి రేపు విచారణకు హాజరు కావాలని కోరిన ఈడీ అధికారులు... ఈసారి అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

హేమంత్ సోరెన్ అరెస్టుకు ఈడీ రంగం సిద్ధం చేస్తుందన్న వార్తలు గుప్పుమనడంతో జార్ఖండ్ లో అధికార కూటమి అప్రమత్తమైంది. ఇవాళ సాయంత్రం జేఎంఎం శాసనసభాపక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. జార్ఖండ్ లో జేఎంఎం కూటమిలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆయనకు గట్టి మద్దతుదారుగా ఉంది. కాంగ్రెస్ తో పాటు కమ్యూనిస్టుల బలం కూడా ఉన్న అధికార యూపీఏ కూటమి ప్రభుత్వం కూలిపోయే అవకాశాలు లేవు. దీంతో ప్రత్యామ్నాయాలపై సోరెన్ దృష్టిపెట్టారు.
ఈ నేపథ్యంలో తన స్ధానంలో సీఎంగా భార్య కల్పనా సోరెన్ ను కూర్చోబెట్టేందుకు హేమంత్ సోరెన్ రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇవాళ సాయంత్రం జేఎంఎం శాసనసభాపక్ష సమావేశంలో కల్పనా సోరెన్ ను ఎమ్మెల్యేలు తమ నేతగా ఎన్నుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత అధికార యూపీఏ కూటమి సమావేశం కూడా జరుగుతుంది. ఇందులో కల్పనా సోరెన్ ను సీఎంగా ఆమోదిస్తారు. అయితే ఈ ఏడాది నవంబర్ లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కల్పనా సోరెన్ ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం కష్టమే. అదే జరిగితే ఆరు నెలల తర్వాత ఆలోచించవచ్చని హేమంత్ సోరెన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications