సారీ చెప్పను.. థగ్ లైఫ్ రిలీజ్ చేయను.. తేల్చేసిన కమల్ హాసన్..!
కన్నడ భాషకు తమిళ భాష తల్లివంటిందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డ నటుడు కమల్ హాసన్ తన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గేందుకు ఇవాళ నిరాకరించారు. ఇప్పటికే ఆ విషయం ప్రకటించిన కమల్ హాసన్.. కన్నడనాట తన తాజా చిత్రం విడుదలకు అడ్డంకులు తొలగించాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు ఆయన్ను సారీ చెప్పాల్సిందేనని తేల్చిచెప్పడంతో అందుకు కమల్ నిరాకరించారు. దీంతో ఈ వ్యవహారం మరింత ముదిరేలా ఉంది.
కన్నడ భాషపై తన చిత్రం థగ్ లైఫ్ ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంపై గతంలో స్పందించిన కమల్ హాసన్ వివరణ ఇచ్చారు. అయితే తాను తప్పు చేయనందున సారీ మాత్రం చెప్పబోనని ప్రకటించారు. దీంతో కన్నడ ఫిల్మ్ ఛాంబర్ థగ్ లైఫ్ చిత్రం విడుదలపై నిషేధం విధించింది. దీనిపై కమల్ హాసన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. చరిత్ర గురించి చెప్పడానికి మీరేమైనా చరిత్రకారుడా అని ప్రశ్నించింది.

అంతే కాదు కమల్ హాసన్ తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేయాలని, సారీ చెప్పాలని సూచించింది. కన్నడ ప్రజల నుంచి మీ థగ్ లైఫ్ సినిమాకు కలెక్షన్లు కావాలని కోరుకుంటున్నప్పుడు వారి మనోభావాలని గుర్తించి క్షమాపణ కోరాలని సూచించింది. అయితే అందుకు కమల్ హాసన్ నిరాకరించారు. కన్నడ భాషపై కమల్ హాసన్ కు ఎంతో గౌరవం ఉందని ఆయన లాయర్ హైకోర్టుకు తెలిపారు. కానీ కమల్ క్షమాపణ మాత్రం చెప్పబోరన్నారు. దీంతో అంత ఇగో ఎందుకని హైకోర్టు ప్రశ్నించింది.
చివరికి తన థగ్ లైఫ్ సినిమా విడుదలకు అడ్డంకులు తొలగించి రక్షణ కల్పించాలన్న వినతిపైనా కమల్ లాయర్ వెనక్కి తగ్గారు. ప్రస్తుతానికి కర్నాటకలో కమల్ హాసన్ థగ్ లైఫ్ సినిమా విడుదల చేయడం లేదని కోర్టుకు తెలిపారు. త్వరలో ఈ వ్యవహారంపై కన్నడ ఫిలిం ఛాంబర్ తో చర్చలు జరుపుతామని కోర్టుకు తెలిపారు. దీంతో హైకోర్టు ఈ కేసు విచారణను ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసింది. వాస్తవానికి ఈ నెల 5న దేశవ్యాప్తంగా థగ్ లైఫ్ సినిమా విడుదలవుతోంది.












Click it and Unblock the Notifications