పునీత్ ఆత్మకు సద్గతి కోసం అరుణాచలం రమణ మహర్షి ఆశ్రమంలో ఇళయరాజా మోక్షదీపం
బెంగళూరు: గుండెపోటుతో కన్నుమూసిన శాండల్‌వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ పార్థివదేహానికి అంత్యక్రియలు ముగిశాయి. కంఠీరవ స్టూడియోలో ప్రభుత్వ లాంఛనాలతో ఈ కార్యక్రమం పూర్తయింది. పునీత్ రెండో అన్న రాఘవేంద్ర రాజ్‌కుమార్ తనయుడు, కన్నడ హీరో వినయ్ రాజ్‌కుమార్ చేతుల మీదుగా అంత్యక్రియల ప్రక్రియ సాగింది. ఈ కార్యక్రమాన్ని కర్ణాటక ప్రభుత్వం అధికార లాంఛనాలతో చేపట్టింది.

రాజకీయ నాయకులు, సినీ పెద్దలు..
కుటుంబ సభ్యులు, రాజకీయ నాయకులు, చిత్ర పరిశ్రమకు చెందిన కొద్దిమంది ప్రముఖులు మాత్రమే దీనికి హాజరయ్యారు. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, మాజీమంత్రి డీకే శివకుమార్, పలువురు మంత్రులు, కన్నడ చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు, తోటి నటీనటులు హాజరయ్యారు. కన్నడ చలన చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మోక్షం కలగాలంటూ..
కేజీఎఫ్ స్టార్ యష్, నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ వంటి కొద్దిమంది ప్రముఖులు పరిమితంగా హాజరయ్యారు. పునీత్ రాజ్‌కుమార్ ఆత్మకు శాంతి కలగాలని, ఆయనకు మోక్షప్రాప్తి కలగాలంటూ ప్రఖ్యాత సంగీత దర్శకుడు మ్యాస్ట్రో ఇళయరాజా ప్రార్థనలు చేశారు. ప్రత్యేక పూజలు చేశారు. తమిళనాడు తిరువణ్ణామలై జిల్లాలోని అరుణాచలంలో గల భగవాన్ రమణ మహర్షి ఆశ్రమంలో ఆయన ఈ పూజలు చేశారు. ఈ సందర్భంగా రమణ మహర్షి సన్నిధిలో మోక్ష దీపాన్ని వెలిగించారు.

భగవాన్ రమణ మహర్షి కృప కలగాలంటూ..
పునీత్ రాజ్‌కుమార్ ఆత్మకు శాంతి కలగాలని, మోక్షప్రాప్తి కలగాలని పూజించారు. ఆయన కుటుంబ సభ్యులకు ఆత్మస్థైర్యాన్ని కలిగించాలని కోరుకున్నారు. భగవాన్ రమణ మహర్షి కృప లభించాలని ప్రార్థించారు. దీనికి సంబంధించిన ఓ వీడియో క్లిప్‌ను ఇళయరాజా తన అధికారిక సోషల్ మీడియా పేజీలో పోస్ట్ చేశారు. ఇళయరాజాకు రాజ్‌కుమార్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ నటించిన అనేక సినిమాలకు ఇళయారాజా సంగీత దర్శకత్వాన్ని వహించారు.
రాజ్‌కుమార్ సినిమాలకు అద్భుతమైన మెలోడీలు..
శివరాజ్ కుమార్, పునీత్ రాజ్‌కుమార్ మూవీలకు ఆయన సంగీతాన్ని అందించారు. మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్, పునీత్ రాజ్‌కుమార్ నటించిన మైత్రీ సినిమాకు ఇళయరాజా సంగీత దర్శకుడు. ఈ సినిమాలోని పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఆయన తండ్రి రాజ్‌కుమార్ నటించిన సినిమాల్లో ఎన్నో ఉన్నాయి. ఇళయరాజా తనదైన శైలిలో అద్భుతమైన మెలోడీలను రాజ్‌కుమార్ సినిమాలకు అందించారు.

శుక్రవారం కన్నుమూసిన పునీత్..
పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్.. శుక్రవారం ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఎక్సర్‌సైజ్ చేస్తోన్న సమయంలో గుండెపోటు సంభవించింది. వెంటవెంటనే రెండుసార్లు ఆయనకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది. విక్రమ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 46 సంవత్సరాలు. భార్య అశ్విని రేవంత్, కుమార్తెలు ధృతి రాజ్‌కుమార్, వందిత రాజ్‌కుమార్ ఉన్నారు. ప్రజలు, అభిమానుల సందర్శనార్థం పార్థివదేహాన్ని కంఠీరవ స్టూడియోలో ఉంచారు. కొద్దిసేపటి కిందటే అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో పూర్తి చేశారు.












Click it and Unblock the Notifications