Maharashtra Horror: మహారాష్ట్ర కుటుంబం మరణానికి అసలు కారణం అదేనా..?
ఐఫోన్ ఈఎంఐ చెల్లింపు విషయంలో ఇంట్లో తలెత్తిన వివాదం కారణంగా మహారాష్ట్రకు చెందిన ఓ కుటుంబం కొండపైనుంచి దూకి మృతి చెందడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మహారాష్ట్ర ఛత్రపతి శంభాజీనగర్ లో జరిగిన ఈ ఘటనలో కుమారుడితోపాటు తల్లిదండ్రులు మృతి చెందారు. సుమారు 500 అడుగుల ఎత్తయిన కొండ మీద నుంచి కిందకు దూకిన కుమారుడ్ని కాపాడబోయి తండ్రి.. ఆ వెంటనే తల్లి కూడా కింద పడి ప్రాణాలు కోల్పోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
అయితే పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్రపతి శంభాజీనగర్ లో మురళీధర్, సంగీత దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి కునాల్ అనే 18 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే కునాల్ ఇటీవల ఒక ఐఫోన్ కొనుగోలు చేశాడు. దాని ఈఎంఐ చెల్లించేందుకు డబ్బుల కోసం ఇంట్లోని పేరెంట్స్ తో గొడవ పడ్డాడు. తల్లిదండ్రులతో తీవ్రంగా గొడవ పడిన కునాల్ మనస్తాపం చెంది మరుసటి రోజు ఉదయం 10 గంటల సమయంలో కోపంతో వాలుజ్ ఎంఐడీసీ పోలీస్ స్టేషన్ పరిధిలోని టిస్గావ్ ప్రాంతంలో ఉన్న ఓ కొండపైకి ఎక్కి అంచున నిలబడ్డాడు. తన దగ్గరికి వస్తే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడం మొదలుపెట్టాడు.
అయితే భయాందోళనకు గురైన తల్లిదండ్రులు మురళీధర్, సంగీతలు కొండపైకి చేరుకుని కునాల్ ను ఓదార్చే ప్రయత్నం చేశారు. కానీ కునాల్ మాత్రం చనిపోవాల్సిందే అని ఫిక్స్ అయ్యాడు. దాదాపు 3 గంటల పాటు జరిగిన హైడ్రామా తర్వాత కొడుకును వెనక్కు లాగేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అదుపుతప్పి తండ్రీకొడుకులు ఇద్దరూ కింద పడి మృతి చెందారు. కళ్ల ముందే ఇంతటి ఘోరం చూసిన తల్లి సంగీత.. క్షణాల్లోనే అక్కడినుంచి దూకేసింది. దాంతో ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర దృశ్యాలు నెట్టింట హల్ చల్ చేశాయి.

అయితే మహారాష్ట్ర కుటుంబం మృతిపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వారి చావుకు ఐఫోన్ వివాదం కాదని తెలుస్తోంది. కునాల్ కు తన తల్లి సంగీత అంటే ప్రాణం. తన తల్లి పాదాలు కడిగి నమస్కారం చేసి హారతి ఇస్తున్న వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది. మరి వీరి చావుకు గల అసలైన కారణాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. మరోవైపు మరణించిన సంగీత సోదరి పల్లవి పాటిల్ ఈ వదంతుల్ని కొట్టిపారేశారు. ఐఫోన్ వివాదం మరణానికి కారణం కాదని అన్నారు. ఈ తీవ్రమైన నిర్ణయం వెనుక కుటుంబపరమైన, ఆర్థికపరమైన లోతైన కారణాలు ఉండవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications