సూపర్ 7: రూ.6,000 పింఛన్: 300 యూనిట్ల ఉచిత విద్యుత్
Haryana Assembly election 2024: ఇంకొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోంది హర్యానా. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల కమిషన్ ఇటీవలే విడుదల చేసింది. ఒకే దశలో ఎన్నికలను నిర్వహించనున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేసింది.
హర్యానాలో ఉన్న మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాలు.. 90. ఒకే దశలో ఆయా స్థానాలన్నింటికీ కూడా పోలింగ్ షెడ్యూల్ అయింది. అక్టోబర్ 5వ తేదీన ఓటింగ్ జరుగనుంది. 8వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఇక్కడ పోల్ అయిన ఓట్లను కూడా అదే రోజున లెక్కిస్తారు.

కాగా- ఈ ఎన్నికల్లో మొత్తం 89 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఒక్క స్థానాన్ని మాత్రం మిత్రపక్షం సీపీఎంకు కేటాయించారు. ప్రస్తుతం అందరి దృష్టి కూడా జులానా నియోజకవర్గంపైనే ఉంది. దీనికి కారణం- అక్కడ రెజ్లర్ వినేష్ ఫొగట్ పోటీ చేస్తోండటమే. కాంగ్రెస్ అభ్యర్థిగా ఆమె బరిలో దిగారు.
ఈ ఎన్నికల్లో విజయం సాధించడానికి పక్కా వ్యూహాలను పన్నింది కాంగ్రెస్. అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ- జన్‌నాయక్ జనతా పార్టీ కూటమిని ఓడించడానికి అవసరమైన హామీలను ప్రజలపై కురిపిస్తోంది. తెలంగాణ, కర్ణాటక తరహాలోనే ఓటర్లకు అనేక వరాలను ప్రకటించింది.
అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధినేత మల్లికార్జున్ ఖర్గే ఈ మేరకు ఏడు గ్యారంటీలతో కూడిన హామీల జాబితాను విడుదల చేశారు. దేశ రాజధానిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటైన విలేకరుల సమావేశంలో- పార్టీ సీనియర్ నాయకులు కేసీ వేణుగోపాల్, అజయ్ మాకెన్, ఇతరులతో కలిసి మాట్లాడారు.
1. మహిళా శక్తి: మహిళలకు ప్రతి నెలా 2,000 రూపాయల ఆర్థిక సహాయం. 500 రూపాయలకే వంటగ్యాస్ సిలిండర్ సరఫరా
2. సామాజిక భద్రత పెన్షన్లు: వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు ప్రతి నెలా 6,000 రూపాయల పింఛన్ చెల్లింపు. ఓపీఎస్ పునరుద్ధరణ
3. యువత భవిష్యత్తుకు భరోసా: ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాల భర్తీ. మద్య నిషేధం అమలు. డ్రగ్ రహిత హర్యానా తీర్చిదిద్దుతామంటూ హామీ
4. ప్రతి కుటుంబానికి ఫ్రీ కరెంట్: ప్రతి నెలా ప్రతి ఇంటికీ 300 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ సరఫరా. 25 లక్షల రూపాయల వరకు ఉచిత ఆరోగ్య బీమా కవరేజీ
5. పేదలకు సొంతిల్లు: పేదలకు 100 గజాల ఇంటి స్థలం కేటాయింపు. 3.5 లక్షల రూపాయలతో రెండు గదుల ఇంటి నిర్మాణం.
6. రైతులకు చేయూత: కనీస మద్దతు ధరకు చట్టబద్ధత. పంట నష్టపరిహారం తక్షణమే చెల్లింపు.
7. బీసీలకు వరాలు: కులగణనకు హామీ. క్రీమీలేయర్ పరిధి 10 లక్షల రూపాయలకు పెంపు












Click it and Unblock the Notifications