తమిళనాడులో మరో 'నిర్భయ': కదులుతున్న బస్సులో బాలికపై గ్యాంగ్ రేప్!
బాలికను మాటల్లో పెట్టి రాత్రి10గం. సమయంలో బస్సును కరుప్పూరు నుంచి నారాయణపాళయం వైపు మళ్లించారు. కీడు శంకించిన బాలిక.. గట్టిగా కేకలు వేయగా నోట్లో గుడ్డలు కుక్కి మరీ అత్యాచారం చేశారు.
చెన్నై: నిర్భయ కేసులో నిందితులకు ఇంకా ఉరిశిక్ష అమలుకాక ముందే తమిళనాడులో మరో నిర్భయ ఘటన చోటు చేసుకుంది. 15ఏళ్ల బాలికపై ఓ బస్సు డ్రైవర్, కండక్టర్ సహా మరో వ్యక్తి సుమారు గంటపాటు కదులుతున్న బస్సులో అత్యాచారానికి పాల్పడ్డారు. తల్లిదండ్రులతో గొడవపెట్టుకుని బయటకు వచ్చేసినందుకు ఆ చిన్నారి ఇలా కామాంధుల చేతిలో బలైపోయింది.
తమిళనాడులోని సేలం జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన దేశంలో మరోసారి ఆడపిల్లల రక్షణ గురించి ప్రశ్నిస్తోంది. సేలం జిల్లాలోని కిచ్చియపాళయంకు చెందిన 15ఏళ్ల బాలిక వలసయ్యూరులోని ఓ ప్రైవేటు స్కూల్లో పదో తరగతి చదువుతోంది. సోమవారం రాత్రి ఏదో విషయమై తల్లిదండ్రులతో గొడవపడి 8.30గం. సమయంలో ఇంటి నుంచి బయటకు వచ్చేసింది.

ఎక్కడికెళ్లాలో తెలియని స్థితిలో సేలం పాత బస్టాండ్ వద్దకు చేరుకుంది. ఇక్కడినుంచి సేలం శివార్లలోని కరుప్పూరు ఇంజనీరింగ్ కళాశాలకు ప్రైవేట్ బస్సులు తిరుగుతుంటాయి. దీంతో ఓ ప్రైవేటు బస్సులో ఎక్కి టికెట్ తీసుకుంది. కరుప్పూరు వద్ద ప్రయాణికులంతా దిగిపోగా.. బాలిక ఒంటరిగా బస్సులోనే ఉండిపోయింది.
బాలిక ఒంటరిగా ఉండటాన్ని గమనించిన ఇద్దరు డ్రైవర్లు, కండక్టర్ ఆ చిన్నారిని కాటేశారు. సేలం సన్యాసిగుండుకు చెందిన మణివణ్ణన్(33) బస్సు డ్రైవర్, అధికారిపట్టికి చెందిన మురుగన్(35) అనే మరో బస్సు డ్రైవర్, వాళప్పాడి ముత్తంపట్టికి చెందిన పెరుమాళ్(22) అనే కండక్టర్ చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టారు.
బాలికను మాటల్లో పెట్టి రాత్రి10గం. సమయంలో బస్సును కరుప్పూరు నుంచి నారాయణపాళయం వైపు మళ్లించారు. కీడు శంకించిన బాలిక.. గట్టిగా కేకలు వేయగా నోట్లో గుడ్డలు కుక్కి మరీ అత్యాచారం చేశారు. ఒకరి తర్వాత ఒకరు.. సుమారు గంట సమయం పాటు కదులుతున్న బస్సులో ముగ్గురు బాలికపై అత్యాచారం చేశారు.
ఆ సమయంలో బస్సును వివిధ ప్రాంతాల్లో నడుపుతూ అత్యాచారానికి పాల్పడుతూనే ఉన్నారు. అయితే బాలిక కేకలు విన్న కొంతమంది స్థానికులు బస్సును అడ్డగించి నిందితులకు దేహశుద్ది చేశారు. పోలీసులకు సమాచారం అందించడంతో.. నిందితులను అరెస్టు చేసి బాలికను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. మరో నిర్భయ ఘటనగా దేశవ్యాప్తంగా ఈ సంఘటన సంచలనంగా మారింది.












Click it and Unblock the Notifications