MLA salary: లగ్జరీ కార్లు, కోట్ల రుణాలు.. ఎమ్మెల్యేల స్పెషల్ బెనిఫిట్స్!
తమిళనాడు ప్రభుత్వం తమ రాష్ట్ర శాసనసభ్యులకు సరికొత్త సదుపాయాలు ప్రకటించడంతో ఎమ్మెల్యేల వేతనాలు, భత్యాల అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. కొత్త నిర్ణయం ప్రకారం అక్కడి ఎమ్మెల్యేలకు ప్రభుత్వ వాహనంతో పాటు నెలకు లక్ష రూపాయల వరకు అదనపు ప్రయోజనాలు సమకూరనున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ప్రజాప్రతినిధులకు అందుతున్న జీతభత్యాలపై ఆసక్తికరమైన చర్చ మొదలైంది.
కేంద్రంలో పార్లమెంట్ సభ్యుల జీతభత్యాలను పార్లమెంటే నిర్ణయిస్తుంది. కానీ, ఎమ్మెల్యేల విషయంలో కథ వేరు. ప్రతి రాష్ట్ర శాసనసభ తన ప్రజాప్రతినిధుల వేతనాలను సొంతంగా చట్టాలు చేసి నిర్ణయించుకుంటుంది. దీనివల్ల దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఒకే రకమైన జీతాల విధానం లేదు. కేవలం మూల వేతనం మాత్రమే కాకుండా నియోజకవర్గ అలవెన్స్, ఆఫీసు మెయింటెనెన్స్ , రవాణా, వసతి, వైద్య ఖర్చుల పేరుతో వేర్వేరు భత్యాలు తోడవుతాయి.

అగ్రస్థానంలో తెలంగాణ.. ఆఖరి వరుసలో కేరళ
జీతభత్యాల పరంగా చూస్తే తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలుస్తోంది. గతంలో పెంచిన అలవెన్సులతో కలిపి ఇక్కడ ఎమ్మెల్యేలు నెలకు సుమారు 2.75 లక్షల రూపాయల వరకు అందుకుంటున్నారు. మరోవైపు కేరళ ఎమ్మెల్యేల వేతనం అత్యల్పంగా ఉంది. అక్కడ అన్ని అలవెన్సులు కలిపి నెలకు సుమారు 70 వేల రూపాయలు మాత్రమే అందుతున్నాయి. అయితే కేవలం జీతం తక్కువగా ఉన్నంత మాత్రాన సదుపాయాలు తక్కువగా ఉన్నాయని చెప్పలేం. కొన్ని రాష్ట్రాలు ఉచిత వసతి, వైద్యం, ప్రయాణ రీయింబర్స్‌మెంట్ రూపంలో అదనపు సదుపాయాలు కల్పిస్తుంటాయి.
జీతం కాకుండా ఇంకా ఏమేమి లభిస్తాయి?
ఎమ్మెల్యేలకు లభించే నెలవారీ వేతనం వారి మొత్తం ప్రయోజనాల్లో ఒక భాగం మాత్రమే. దీనికి అదనంగా అనేక సౌకర్యాలు అందుతాయి:
- నియోజకవర్గ నిర్వహణ అలవెన్స్: స్థానిక ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి, పర్యటనలకు అయ్యే ఖర్చులు.
- సిబ్బంది అలవెన్స్: పీఏలు, ఆఫీస్ స్టాఫ్ వేతనాల కోసం.
- రవాణా, రోజువారి ఖర్చులు: అసెంబ్లీ సమావేశాలు, కమిటీ భేటీలకు హాజరైనప్పుడు ప్రత్యేక అలవెన్సులు.
- వసతి, వైద్యం: రాజధానిలో ఉచిత ప్రభుత్వ నివాసం లేదా ఇంటి అద్దె, కుటుంబసభ్యులకు ఉచిత వైద్య సదుపాయం.
కొన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక ప్రయోజనాలు
హర్యానా వంటి రాష్ట్రాలు ఎమ్మెల్యేలకు ఇల్లు లేదా కారు కొనుగోలు చేయడానికి రూ. 1 కోటి వరకు తక్కువ వడ్డీకే రుణాలు అందించే సదుపాయం కల్పించాయి. అలాగే ఇళ్ల మరమ్మతులకు అడ్వాన్సులు కూడా ఇస్తాయి. అదే సమయంలో ఒడిశాలో నియోజకవర్గ అభివృద్ధికి ఏడాదికి రూ. 5 కోట్లు కేటాయిస్తారు. అయితే ఇది ఎమ్మెల్యే వ్యక్తిగత ఆదాయం కాదు, నియోజకవర్గంలో రోడ్లు, పాఠశాలలు, ఇతర అభివృద్ధి పనులకు వెచ్చించే ప్రజాధనం.
రాష్ట్రానికో రకం.. ఎందుకీ వ్యత్యాసం?
ప్రతి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అక్కడ ఉండే జీవన వ్యయం ఆధారంగా ప్రజాప్రతినిధుల భత్యాలు మారుతుంటాయి. భౌగోళికంగా పెద్దగా ఉన్న నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల ప్రయాణ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు కాలక్రమేణా ఎమ్మెల్యేల డిమాండ్లను బట్టి ఆయా రాష్ట్ర అసెంబ్లీలు చట్టాల్లో సవరణలు చేస్తూ జీతభత్యాలను సమీక్షిస్తుంటాయి.














Click it and Unblock the Notifications