'ఆ సీఎంను తొలగించేంత దమ్ము మోడీకి లేదా..?'

Subscribe to Oneindia Telugu

గాంధీనగర్ : మోడీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక గుజరాత్ పగ్గాలను ఆనందిబెన్ కు అప్పగించిన విషయం తెలిసిందే. అయితే మోడీ అంత సమర్థవంతంగా ఆనందిబెన్ అటు పార్టీని, ఇటు ప్రభుత్వాన్ని నడిపించడంలో విఫలమవుతున్నారన్న ఆరోపణలున్నాయి. ముఖ్యంగా పటేళ్ల రిజర్వేషన్ పోరాటాన్ని సర్దుమణిగించడంలో ఆనందిబెన్ విఫలమవడం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న బీజేపీ అధిష్టానం, ఆనందిబెన్ పై వేటు వేయాలని చూస్తోన్నా ఆచరణలో మాత్రం సాధ్యపడలేదు.

పైగా వచ్చే ఏడాది గుజరాత్ కు అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో, అప్పటివరకు ఆనందిబెన్ నే సీఎంగా కొనసాగిస్తే బీజేపీ ఓటు బ్యాంకుకు దెబ్బ పడే అవకాశాలు ఉన్నట్టుగా భావిస్తోంది బీజేపీ అధినాయకత్వం. ఈ పరిస్థితి తలెత్తకుండా ఉండడానికి ఇప్పటినుంచే దిద్దుబాటు చర్యలను మొదలుపెట్టాలని భావించిన బీజేపీ అధిష్టానం, ఆనందిబెన్ పై వేటు వేసేందుకు సిద్దమైనా..! ఆచరణలో మాత్రం సాధ్యపడట్లేదు.

ఏ కారణం లేకుండా ఆనందిబెన్ ను సీఎం కుర్చీ నుంచి తప్పిస్తే.. పార్టీకి చెడ్డపేరు వచ్చే అవకాశం ఉండడంతో దీనికోసం ఓ ప్రత్యామ్నాయ ఆలోచన చేసిన బీజేపీ భంగపడ్డట్టుగా తెలుస్తోంది. 75 ఏళ్లు పైబడ్డ వ్యక్తులకు నాయకత్వ పగ్గాలు అప్పగించరాదన్న ప్రధాని మోడీ ఆలోచనతో ఈ ఆచరణను అమలు చేయాలనుకుంది బీజేపీ అధిష్టానం.

Modi not having guts to remove Anandiben Patel A Gujarat minister

ఇదే జరిగితే.. వచ్చే నవంబర్ నాటికి 75 ఏట అడుగుపెడుతున్న ఆనందిబెన్ ను తప్పించడానికి మార్గం సుగమమవుతుంది. ఎలాంటి చిక్కులు లేకుండా పార్టీ నిబంధనల కింద ఆనందిబెన్ ను సీఎం కుర్చీ నుంచి దించేయొచ్చు. గతంలో అద్వానీ, మురళీ మనోహర్ జోషి వంటి నేతలను కూడా వయసు పైబడ్డ కారణంగానే పక్కనబెట్టిన విషయం తెలిసిందే. బీజేపీ అధిష్టానం ఆదేశాల మేరకు మధ్యప్రదేశ్ కేబినెట్ లోను వయసు పైబడ్డ హోంమంత్రి బాబూలాల్ గౌర్ (86) ను ప్రజా వ్యవహారాల శాఖ మంత్రి సర్థార్ సింగ్ (76) ను సీఎం శివరాజ్ సింగ్ పక్కనబెట్టేశారు.

అయితే మోడీ కేబినెట్ లో 75 ఏళ్లు పైబడి కూడా మంత్రులుగా కొనసాగుతున్న మైనారిటీ శాఖ మంత్రి నజ్మా హెప్తుల్లా, సూక్ష్మ, చిన్న, మధ్య తరగతి పరిశ్రమల శాఖ మంత్రి కల్ రాజ్ మిశ్రా లాంటి వ్యక్తులను పక్కనబెట్టి ఏజ్ బార్ కారణంతో ఆనందిబెన్ ను తప్పిస్తే విమర్శలు వచ్చే అవకాశం ఉండడంతో బీజేపీ అధిష్టానం సీఎం ఆనందిబెన్ ను తప్పించాలనే ఆలోచనకు ఫుల్ స్టాప్ పెట్టినట్టుగా తెలుస్తోంది.

అయితే కేంద్రమంత్రి కల్ రాజ్ మిశ్రాను, మరో కేంద్రమంత్రి నజ్మా హెప్తుల్లాను పదవుల్లో నుంచి తప్పించాలని పార్టీ భావించినప్పటికీ దానివల్ల భవిష్యత్తులో పార్టీకి దెబ్బపడే అవకాశం ఉండడంతో ఆ ఆలోచన విరమించుకున్నారట. కేంద్రమంత్రి కల్ రాజ్ మిశ్రా ఉత్తరప్రదేశ్ కు చెందిన బ్రాహ్మణ సామాజిక వర్గం వ్యక్తి కావడం, వచ్చే ఏడాది యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో 9 శాతం ఓటర్లున్న బ్రాహ్మణ సామాజిక వర్గం ఎక్కడ పార్టీకి దూరమైపోతుందోనన్న భయంతో ఆ ప్రయత్నం చేయలేదని సమాచారం.

ఏదైమైనా.. ఆనందిబెన్ ను తప్పించాలని బీజేపీ అధిష్టానం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఏదో ఒక రూపంలో వాటన్నింటికీ బ్రేక్ పడుతూనే ఉంది. ఇదే విషయంపై స్పందించిన ఆనందిబెన్ కేబినెట్ లోని మంత్రి ఒకరు సీఎం పదవి నుంచి ఆమెను తొలగించేంత దమ్ము లేదని సవాల్ చేయడంతో ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A Bjp minister of Gujarat made some interesting comments that 'Modi not having guts to remove Anandiben Patel from CM position'

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి