సిద్ధరామయ్య బిగ్ స్టేట్‌మెంట్..
Siddaramaiah: కర్ణాటకలో రాజకీయ ప్రకంపనలను సృష్టిస్తోన్న మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (MUDA scam)లో చోటు చేసుకున్నట్లుగా భావిస్తోన్న భారీ కుంభకోణం వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఈ అంశంపై ఆ రాష్ట్ర హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు బిగ్ షాక్ ఇచ్చింది.
గవర్నర్ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ముడా కేసులో విచారణను ఎదుర్కొనాల్సిందేనని తేల్చి చెప్పింది. ఇందులో ఎలాంటి మినహాయింపులు ఉండవని పేర్కొంది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ కింద ఎవరైనా సరే తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోక తప్పదని, సొంతంగా ఎలాంటి నిర్ణయాలనైనా తీసుకునే అధికారం గవర్నర్‌కు ఉందంటూ న్యాయమూర్తి జస్టిస్ ఎం నాగప్రసన్న సారథ్యంలోని బెంచ్ తుది తీర్పు ఇచ్చింది.

దీనిపై సిద్ధరామయ్య స్పందించారు. దర్యాప్తుకు వెనుకాడట్లేదని అన్నారు. న్యాయ నిపుణులతో సంప్రదించనున్నానని, వారితో చర్చించిన అనంతరం తన తదుపరి నిర్ణయాలు ఉండబోతాయని చెప్పారు. తనపై ఉద్దేశపూరకంగానే విచారణ జరుగనుందనే నిజం ఇంకొద్ది రోజుల్లోనే బయటకు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
భారతీయ న్యాయసంహితలోని సెక్షన్ 218 కింద విచారణ జరపడానికి హైకోర్టు అంగీకరించలేదని సిద్ధరామయ్య తెలిపారు. సెక్షన్ 17ఏ కింద మాత్రమే విచారణ జరపడానికి ఆమోదం తెలిపిందని గుర్తు చేశారు. మున్ముందు ఇది కూడా నిలువలేదనే విషయం నిరూపితమౌతుందని అన్నారు.
తన పోరాటంలో ఎట్టకేలకు సత్యమే గెలుస్తుందని సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగా తనపై విచారణకు ఆదేశాలు వెలువడినట్లు భావిస్తోన్నానని అన్నారు.
అన్ని కోణాల్లో తన న్యాయ పోరాటం కొనసాగుతుందని, అండగా కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం, నాయకులు, కార్యకర్తలు అండగా నిలిచారని వ్యాఖ్యానించారు. అన్నభాగ్య, క్షీరభాగ్య, క్షీరధార, విద్యాసిరి, కృషిభాగ్య, పశుభాగ్య, ఇందిరా క్యాంటీన్.. వంటి సంక్షేమ పథకాలను ఎన్నో అమలు చేశానని, పేదల పక్షపాతిగా, సామాజిక న్యాయం కోసం పోరాడుతున్నానని అన్నారు.
అందుకే- బీజేపీ, దాని మిత్రపక్షం జనతాదళ్ (సెక్యులర్) తనపై రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నాయని సిద్ధరామయ్య విమర్శించారు. 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏనాడూ అవినీతికి పాల్పడలేదని, రైతులు, మహిళల ఆశీర్వాద బలంతో తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటానని అన్నారు.












Click it and Unblock the Notifications