మా అమ్మ చనిపోతుంది.. ఆక్సిజన్ సిలిండర్ తీసుకెళ్లొద్దు: వ్యక్తి వేడుకోలు, అసలేం జరిగింది?(వీడియో)
ఆగ్రా: మనదేశంలో పలు రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉన్న విషయం తెలిసిందే. ఆగ్రాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఓ ప్రైవేటు ఆస్పత్రి వద్ద ఆక్సిజన్ సిలిండర్‌ను తీసుకెళ్లవద్దంటూ ఓ వ్యక్తి పోలీసులకు వేడుకుంటున్నాడు.

నా తల్లి చనిపోతుందంటూ..
'నా తల్లి చనిపోతుంది. ఆక్సిజన్ సిలిండర్లను దయచేసి తీసుకెళ్లకండి. మిమ్మిల్ని వేడుకుంటున్నా' అని ఆగ్రాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి వద్ద మోకాళ్ల మీద నిలబడిన ఓ వ్యక్తి పోలీసులను వేడుకున్నాడు. సోమవారం సాయంత్రం సదర్‌లోని ఆస్పత్రి బయట చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
పీపీఈ కిట్ ధరించి మోకాళ్లపై పోలీసులకు వేడుకోలు..
ఆ ఆస్పత్రి నుంచి సిలిండర్లను బయటికి తీసుకొచ్చిన పోలీసులు.. ఓ అంబులెన్స్‌లో పెట్టారు. ఈ సమయంలోనే పీపీఈ కిట్ ధరించిన వ్యక్తి పోలీసులను వేడుకున్నాడు. తన తల్లి ఈ ఆస్పత్రిలోనే చేరిందని, ఆక్సిజన్ సిలిండర్లు తీసుకెళితే.. తన తల్లి బతకదని వాపోయాడు. అయితే, అతడ్ని పట్టించుకోకుండా పోలీసులు తమ పని తాము చేసుకుంటూ వెళ్లిపోయారు. దీంతో పోలీసులపై విమర్శలు వెల్లువెత్తాయి.
Recommended Video
తీసుకెళ్లినవి ఖాళీ సిలిండర్లు మాత్రమే.. ఆగ్రా ఎస్పీ వివరణ
ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు ఈ ఘటనపై స్పందించారు. పోలీసుల తీరుపై వస్తున్న ఆరోపణలను ఖండించారు. ఆ ప్రైవేటు ఆస్పత్రి నుంచి తాము నిండుగా ఉన్న ఆక్సిజన్ సిలిండర్లను తీసుకెళ్లలేదని.. ఖాళీ సిలిండర్లను మాత్రమే తీసుకెళ్లామని ఆగ్రా ఎస్పీ స్పష్టం చేశారు. ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత ఎక్కువగా ఉండటంతో పలువురు తమ వ్యక్తిగత సిలిండర్లను ఆస్పత్రికి ఇచ్చారని తెలిపారు. ఖాళీ అయిన ఆ సిలిండర్లను మాత్రమే తాము తీసుకెళ్లామని ఎస్పీ వివరించారు. తన కుటుంబసభ్యులు ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారని, ఆమె కోసం ఆక్సిజన్ సిలిండర్ కావాలని అతను అడిగాడని తెలిపారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే అలాంటి వీడియోలను కొందరు దురుద్దేశంతో వైరల్ చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసులను తప్పుగా చిత్రీకరిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేదని ఇప్పటికే యూపీ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, పలు ఆస్పత్రులు మాత్రం ఆక్సిజన్ కొరత ఎదుర్కొంటున్నట్లు పేర్కొంటున్నాయి.












Click it and Unblock the Notifications