ఐసిస్ తో లింక్ ?, లక్షల్లో రివార్డు ఉన్న తప్పించుకున్న అరాఫత్ ఆలీ, ఎన్ఐఏ పంజా !
బెంగళూరు/మంగళూరు: గుట్టుచప్పుడు కాకుండా ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్న వారిమీద పోలీసులతో పాటు ఎన్ఐఏ అధికారులు నిఘా వేశారు. మూడు సంవత్సరాల నుంచి తప్పించుకుని తిరుగుతూ ఉగ్రవాదులతో లింక్ పెట్టుకున్న వ్యక్తిని ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు. లక్షల రూపాయల రివార్డు ప్రకటించినా చాకచక్యంగా తప్పించుకుని తిరుగుతున్న వ్యక్తి ఎన్ఐఏ వలలో చిక్కిపోయాడు.
ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్)తో లింక్ పెట్టుకుని ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్న అనుమానిత ఉగ్రవాది అరాఫత్ అలియాస్ అరాఫత్ ఆలీని కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు. కర్ణాటకలోని మంగళూరులో జరిగిన కుక్కర్ బాంబు కేసుతో అరాఫత్ కు సంబంధం ఉందని ఎన్ఐఏ అధికారులు అంటున్నారు.

మంగళూరులో కుక్కర్ బాంబు పేల్చడానికి అనుమానిత ఉగ్రవాది అరాఫత్ ఆలీ సహకరించాడని ఇప్పటికే పోలీసులు అనుమానం వ్యక్తం చేశారని ఎన్ఐఏ అధికారులు అంటున్నారు. మంగళూరు కుక్కర్ బాంబు కేసులోని ప్రధాన నిందితుడు, నిషేధిత ఆల్ హింద్ ఐఎస్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు పెట్టుకున్న షారిక్ కు ఈ అరాఫత్ సహకరించాడని ఎన్ఐఏ అధికారులు అంటున్నారు.
శివమొగ్గ జిల్లాలోని తీర్థహళ్లిలోని బాళేబైలు సమీపంలోని జట్ పేట్ లో నివాసం ఉంటున్న అరాఫత్ ఉగ్రవాదులతో లింక్ పెట్టుకున్నాడు. అరాఫత్ తండ్రి మోను తీర్థహళ్లిలో బీడీ అంగడి నిర్వహిస్తున్నాడని, అబ్దుల్ మతీన్ అనే నిందితుడు తీర్థహళ్లిలోని బాళేబైలి ప్రాంతంలో బీడా అంగడి నిర్వహిస్తున్నాడని, సోప్పుగుడ్డ ప్రాంతంలో షారిక్ నివాసం ఉంటున్నాడని పోలీసు అధికారులు అంటున్నారు.

బాంబులు ఎలా తయారు చెయ్యాలి అని అబ్దుల్ మతిన్, అరాఫత్ విదేశాల్లోనే శిక్షణ తీసుకున్నారని, తరువాత కర్ణాటకలోని మలేనాడు, కరావళి ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు సాగించడానికి ప్రయత్నించారని అధికారులు అంటున్నారు. ఐసీస్ ఉగ్రవాద సంస్థతో లింక్ పెట్టుకున్న అరాఫత్ ఇంతకాలం తప్పించుకుని తిరగడంతో అతన్ని పట్టించిన వారికి రూ. 3 లక్షలు బహుమానం అందిస్తామని ఇప్పటికే ఎన్ఐఏ అధికారులు ప్రకటించారు.
ఐసిస్ ఉగ్రవాదులతో లింక్ పెట్టుకున్నారని ఆరోపిస్తూ మంగళూరుకు చెందిన మాఝు మునీర్ అహమ్మద్, శివమొగ్గలోని సిద్దేశ్వర నగర నివాసి సయ్యద్ యాసిన్ అలియాస్ బైలు అనే నిందితులను 2020 సెప్టెంబర్ 20వ తేదీన అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇదే ఐసీస్ ఉగ్రవాద సంస్థతో లింక్ పెట్టుకున్న వారి మీద ఎన్ఐఏ అధికారులు, స్థానిక పోలీసులు నిఘా వేశారు.












Click it and Unblock the Notifications