జైలు నంబర్-3: ఆ నలుగురి ఉరితీతపై ట్రయల్ రన్: సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేలా జాగ్రత్తలు..!
న్యూఢిల్లీ: యావత్ దేశాన్ని వణికించిన నిర్భయ సామూహిక అత్యాచారం కేసులో నలుగురు దోషులకు ఈ నెల 22వ తేదీన ఉరి తీయబోతున్న నేపథ్యంలో.. దీనికి సంబంధించిన ఏర్పాట్లలో అధికారులు నిమగ్నం అయ్యారు. బుధవారం నుంచి రోజూ వారి ఆరోగ్యాన్ని పరీక్షించనున్నారు. ఆ నలుగురూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీనితో పాటు- ఉరితీతపై ట్రయల్ రన్‌ను నిర్వహించనున్నారు.

తీహార్ జైలు అధికారుల చేతికి డెత్ వారెంట్..
నిర్భయ దోషులకు ఉరిశిక్షను ఖరారు చేస్తూ దేశ రాజధానిలోని పటియాలా హౌస్ న్యాయస్థానంలో మంగళవారం డెత్ వారెంట్‌ను జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 22వ తేదీన ఉదయం 7 గంటలకు నిర్భయ దోషులకు ఉరిశిక్షను అమలు చేయాల్సి ఉంటుందని ఈ డెత్ వారెంట్‌లో స్పష్టం చేశారు. డెత్ వారెంట్ జారీ చేసిన వెంటనే దీనికి సంబంధించిన అసలు ప్రతులను న్యాయస్థానం సిబ్బంది.. తీహార్ జైలు అధికారులకు అందజేశారు.

జైలు నంబర్ 3 రెడీ..
దేశంలోనే అతిపెద్ద కేంద్ర కారాగారం తీహార్. ఇందులోని మూడో నంబర్ జైలులో నిర్భయ దోషులను ఉరి తీయబోతున్నారు. దీనికోసం బుధవారం జైలు అధికారులు ట్రయల్ రన్‌ను నిర్వహించబోతున్నారు. ఒకేసారి వేర్వేరు ఉరికంబాలను ఆ నలుగురినీ ఎక్కించబోతుండటంతో.. దీనికి అనుగుణంగా చర్యలు తీసుకోనున్నారు. వేర్వేరు ఉరికంబాలకు ఒకేసారి డమ్మీ ఉరితీత కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

డమ్మీ ఉరితీత ఇలా..
డమ్మీ ఉరితీతలో భాగంగా దోషుల శరీర బరువుతో కూడిన ఇసుక సంచులను ఉరికంబానికి తగిలిస్తారు. సుమారు 30 నిమిషాల పాటు వాటిని అలాగే ఉంచుతారు. ఇదే తరహా ట్రయల్ రన్ కనీసం నాలుగు సార్లు చేపట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఉరితాడు, ఉరికొయ్యల పటిష్టత, వాటికి అమర్చిన లివర్‌ల పనితీరును పరీక్షించడానికే ఈ ఏర్పాటు చేసినట్లు తీహార్ జైలు అధికారులు చెబుతున్నారు. ఉరితీయడానికి రెండు రోజుల ముందు కూడా డమ్మీ ఉరితీతను నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.

ఆ నలుగురూ విరే..
నిర్భయపై అత్యాచారానికి పాల్పడిన ఆరుమందిలో నలుగురు ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. ఆరుమందిలో రామ్ సింగ్ అనే దోషి ఆత్మహత్య చేసుకున్నాడు. మరొకరు మైనర్ గా తేలడంతో మూడేళ్ల జువైనల్ శిక్షను అనుభవించి, విడుదలయ్యాడు. ఇక మిగిలిన నలుగురిలో అక్షయ్ కుమార్ సింగ్, పవన్ కుమార్ గుప్తా, ముఖేష్ కుమార్, వినయ్ శర్మలకు ఉరిశిక్షను అమలు చేయాల్సి ఉంది. ఈ మేరకు ఇదివరకే వారికి సుప్రీంకోర్టు ఉరిశిక్షను ఖరారు చేసినప్పటికీ.. న్యాయపరమైన చిక్కుల వల్ల సాధ్యం కాలేదు.












Click it and Unblock the Notifications