షారూక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ కు బెయిల్ నిరాకరణ; అక్టోబర్ 7 వరకు ఎన్సీబీ కస్టడీ; ఆర్యన్ కన్నీరు
సినీ నటుడు షారూక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో నిన్న అరెస్టయిన విషయం తెలిసిందే. షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ కు బెయిలు మంజూరు చేయాలని ఈ రోజు కోర్టులో వాదనలు వినిపించినా కోర్టు ఆర్యన్ ఖాన్ కు బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరించింది. అంతేకాదు విచారణ నిమిత్తం 23 ఏళ్ల ఆర్యన్ ఖాన్ ను ముంబై కోర్టు గురువారం వరకు డ్రగ్స్ నిరోధక ఏజెన్సీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) కస్టడీకి అప్పగించింది.

ఎన్సీబీ కస్టడీ విధిస్తూ కోర్టు నిర్ణయం .. కన్నీళ్లు పెట్టుకున్న ఆర్యన్ ఖాన్
ఈ కేసులో దర్యాప్తు ప్రధానమైనదని, దానిని నిర్వహించాల్సిన అవసరం ఉందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ఆర్యన్ ఖాన్ తో పాటు, ఆర్యన్ స్నేహితుడు అర్బాజ్ మర్చంట్ మరియు మున్మున్ ధమేచాను కూడా అక్టోబర్ 7 (గురువారం) వరకు ఎన్‌సిబి కస్టడీకి పంపించారు. న్యాయమూర్తి నిర్ణయాన్ని ప్రకటించిన సమయంలో వారు "కన్నీళ్లు పెట్టుకున్నారు". ముంబై నుండి గోవా వెళ్తున్న "కార్డెలియా" క్రూయిజ్‌లో శనివారం రాత్రి జరిగిన రేవ్ పార్టీపై డ్రగ్స్ నిరోధక ఏజెన్సీ దాడి చేసిన తర్వాత ఆదివారం ముగ్గురిని అరెస్టు చేశారు.

ఎన్సీబీ దాడుల్లో పట్టుబడిన డ్రగ్స్.. అక్టోబర్ 11 వరకు కస్టడీ కోరిన ఎన్సీబీ
ఈ దాడుల్లో 13 గ్రాముల కొకైన్, 21 గ్రాముల చరాస్, 22 మాత్రలు ఎండీఎంఏ మరియు 5 గ్రాముల ఎండీ లభించాయని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో తెలిపింది. వారి వద్ద బట్టలు, లోదుస్తులు మరియు పర్సులలో డ్రగ్స్ దాచినట్టుగా సమాచారం .ఆర్యన్ ఖాన్‌ను ప్రశ్నించడానికి అక్టోబర్ 11 (సోమవారం వారం) వరకు కస్టడీలో ఉండాలని ఏజెన్సీ కోర్టుకు తెలిపింది. ఈ కేసులో అంతర్జాతీయ డ్రగ్ మాఫియాతో లింకులు ఉన్నాయని ఎన్సీబీ అధికారులు ఆరోపించారు.

ఆర్యన్ ఖాన్ చాట్ లలో సీక్రెట్ కోడ్ లు , విచారణ చెయ్యాలని కోర్టుకు ఎన్సీబీ విజ్ఞప్తి
నిందితులను విచారించక పోతే ఎవరు సరఫరా చేస్తున్నారో ? ఎవరు ఫైనాన్స్ చేస్తున్నారో? తెలుసుకోవడం కష్టమవుతుందని ఎన్‌సిబి తెలిపింది. చాట్‌లు మొదలైన లింక్‌లు అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియా యొక్క ప్రమేయాన్ని చూపుతున్నాయని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో న్యాయవాది కోర్టుకు చెప్పారు. ఆర్యన్ ఖాన్ చాట్‌లు మరియు లింక్‌లలో "కోడ్ పేర్లు" కనుగొనబడ్డాయని, ఆర్యన్ ఖాన్ బ్యాంకు ఖాతాలో నగదు బదిలీ లను ధ్రువీకరించాల్సిన అవసరముందని పేర్కొన్నారు.

ఆర్యన్ ఖాన్ తరపున బలంగా వాదించిన న్యాయవాది సతీష్ మానషిండే
ఆర్యన్ ఖాన్ క్రూయిజ్ షిప్‌కు ప్రత్యేక ఆహ్వానితుడని ఈ కేసులో అతని ప్రమేయం లేదని ఆర్యన్ ఖాన్ తరఫున వాదించిన సతీష్ మానషిండే వాదించారు. ఆర్యన్ ఖాన్ బ్యాగ్‌లో ఏమీ లేవని, అతని బ్యాగ్‌లో 6 గ్రాములు అతి తక్కువ పరిమితిలో మాత్రమే డ్రగ్స్ ఉన్నట్లు కోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు. అధికారులు తన ఫోన్‌లో చాట్‌లను మాత్రమే కనుగొన్నారని మరియు "రికవరీ లేని వాట్సాప్ చాట్‌లకు" ఎలాంటి ప్రాముఖ్యత లేదని సతీష్ మానషిండే అన్నారు. ఆర్యన్ ఖాన్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది సతీష్ మానషిండే పార్టీలో ఆర్యన్ ఎటువంటి మాదక ద్రవ్యాల వినియోగానికి పాల్పడలేదని పేర్కొన్నారు.
Recommended Video

ఇతర నిందితుల వద్ద డ్రగ్స్ దొరికితే ఆర్యన్ ను కస్టడీకి అడుగుతున్నారని వాదన
ఇతర నిందితుల వద్ద నుండి స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ వల్ల తనను కస్టడీకి అడగడం సమంజసం కాదని ఆర్యన్ ఖాన్ తరఫు న్యాయవాది వాదించారు. అంతర్జాతీయ డ్రగ్స్ రవాణా గురించి ఎన్సీపీ వాదన చేస్తోందని, ఎలాంటి ఆధారాలు లేకుండా తీవ్రమైన ఆరోపణలు చేయడం సమంజసం కాదని ఆర్యన్ ఖాన్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు. బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ తనయుడు ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో ఉండడంతో ఇప్పుడు బాలీవుడ్ వర్గాలలో దీనిపై చర్చ జరుగుతోంది.












Click it and Unblock the Notifications