Income Tax: ఇన్‌కం ట్యాక్స్ కట్టని ఏకైక రాష్ట్రం.. కోట్లు సంపాదించినా నో ట్యాక్స్.. ఇదీ అసలు మ్యాటర్
Tax free state: దేశంలో నివసిస్తూ, కేంద్రం నిర్దేశించిన మొత్తం కంటే ఎక్కువ సంపాదిస్తున్న ప్రతి పౌరుడూ ఆదాయపు పన్ను కట్టాల్సిందే అని అనుకుంటే పప్పులే కాలేసినట్లే. వారు భారతీయులు అయినప్పటికీ, కోట్లకు కోట్లు ఆర్జిస్తున్నా ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ చెల్లించని వారు ఇండియాలో చాలామందే ఉన్నారు. ఒక్కరు, ఇద్దరు కాదు ఏకంగా ఓ రాష్ట్రం యావత్తుకు ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఉంది.
పాత మరియు కొత్త పన్ను విధానాలు, స్టాండర్డ్ డిడక్షన్, ఆదాయపు పన్ను శ్లాబుల్లో మార్పులు వంటి వాటి గురించి దేశం యావత్తు బుర్ర బద్దలు కొట్టుకుంటూ ఉంటుంది. అయితే ఈశాన్య రాష్ట్రం సిక్కిం ప్రజలు మాత్రం తమకేమీ పట్టవన్నట్లు వ్యవహరిస్తారు. ఎందుకంటే ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 10 ప్రకారం ఈ రాష్ట్ర ప్రజలు పన్నులు చెల్లించడం నుంచి మినహాయించబడ్డారు.

సిక్కిం 3 శతాబ్ధాలకుపైగా రాచరిక రాష్ట్రంగా ఉంది. 1975లో ఆ రాష్ట్రం భారత్‌లో విలీనం కావడం ఒక షరతుపై జరిగింది. అదే సిక్కిం పౌరులు తమ ఆదాయంతో సంబంధం లేకుండా కేంద్రానికి ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అక్కడ నివసించే ఎవరైనా డివిడెండ్‌లు లేదా సెక్యూరిటీలపై వడ్డీల ద్వారా పొందిన ఆదాయంపై కూడా ఇదే మినహాయింపు వర్తిస్తుంది.
ఏప్రిల్ 26, 1975 నాటికి సిక్కిం రాష్ట్రంలో నివాసం ఉండే ఏ వ్యక్తి అయినా ట్యాక్సులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ మేరకు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 371(ఎఫ్) ప్రకారం సిక్కిం ప్రత్యేక హోదాలో పొందుపరచబడింది. అదనంగా సిక్కిం పౌరులు భారతీయ సెక్యూరిటీలు మరియు మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులకు పాన్ వివరాలను అందించడం తప్పనిసరి కాదు.
సిక్కిం వెలుపల ఉన్న ఆస్తుల నుంచి వచ్చే వివిధ రకాల ఆదాయాలకు ఈ మినహాయింపు వర్తించదు. ఏప్రిల్ 1, 2008 తర్వాత రాష్ట్రంలో నివసించని వారిని వివాహం చేసుకున్న సిక్కిం మహిళలకు కూడా ఈ బెనిఫిట్ పొందేందుకు అర్హులు కాదు. ఇదే విషయాన్ని కోర్టుల్లో సవాలు చేసినప్పటికీ భారత అత్యున్నత న్యాయస్థానం సూప్రీంకోర్టు కూడా దీనిని సమర్థించింది.
కాగా కేవలం సిక్కిం ప్రజలే కాకుండా త్రిపుర, మిజోరం, మణిపూర్, నాగాలాండ్, అస్సాం మరియు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన పలు షెడ్యూల్డ్ తెగలకు చెందిన వారు కూడా పన్నులు చెల్లించకుండా మినహాయించబడ్డారు. లడఖ్ ప్రాంతం మరియు జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో నివసిస్తున్న గిరిజనులు కూడా ఈ బెనిఫిట్ పొందుతున్నారు.












Click it and Unblock the Notifications