నీట్ రిజల్ట్స్ వచ్చేశాయ్: సెంటర్ల వారీగా: లింక్ ఇదే
NEET UG 2024 results: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్- అండర్ గ్రాడ్యుయేట్ (NEET-UG) 2024 పరీక్షల ఫలితాలను విడుదల చేసింది. తన అధికారిక వెబ్‌సైట్‌లో వాటిని పొందుపరిచింది. అభ్యర్థులు exams.nta.ac.in/NEET, neet.ntaonline.in వెబ్‌సైట్‌లల్లో వాటిని చెక్ చేసుకోవచ్చు.
ఈ పరీక్షల ఫలితాలను ఈ నెల 20 లోగా ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రకటించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు ఎన్టీఏను ఆదేశించిన విషయం తెలిసిందే. దీనిపై స్వయంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్.. స్పష్టమైన ఆదేశాలను ఇచ్చారు. రాష్ట్రం, సెంటర్ వారీగా వాటిని వెల్లడించాలని అన్నారు. దీనికి అనుగుణంగా ఎన్టీఏ.. ఈ మధ్యాహ్నం నీట్ యూజీ పరీక్షల ఫలితాలను విడుదల చేసింది.

ఇదివరకు ఈ పరీక్షలు ఏ స్థాయిలో వివాదాస్పదం అయ్యాయో తెలిసిందే. పేపర్ లీక్ కావడం, గ్రేస్ మార్కులు కలపడం, ప్రశ్నాపత్రాలను అమ్ముకోవడం వంటి ఆరోపణలతో నీట్ పరీక్షలు అత్యంత వివాదాస్పదం అయ్యాయి. దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. దీనిపై కొందరు విద్యార్థులు సుప్రీంకోర్టు సైతం ఆశ్రయించారు.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. కీలక ఆదేశాలను ఇచ్చింది. అభ్యర్థులు సాధించిన మార్కులను వెబ్‌సైట్‌లో పొందుపర్చాలని సూచించింది. అలాగే- వారు రాసిన పరీక్ష కేంద్రాలవారీగా ఈ ఫలితాలను వెల్లడించలని పేర్కొంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్టీఏ నీట్ యూజీ ఫలితాలను విడుదల చేసింది.
ఈ ఏడాది మే 5వ తేదీన దేశవ్యాప్తంగా 4,750 కేంద్రాల్లో నీట్ పీజీ పరీక్షలను నిర్వహించింది ఎన్టీఏ. 23.33 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలను రాశారు. అలాగే నీట్ యూజీ రీ-ఎగ్జామ్ కూడా జూన్ 23వ తేదీన కాండక్ట్ చేసింది. ఇందులో 1,563 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు.
exams.nta.ac.in/NEET వెబ్‌సైట్ ద్వారా విద్యార్థులు తమ మార్క్ కార్డ్‌ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. వెబ్‌సైట్ హోమ్‌పేజీకి వెళ్లిన తరువాత అక్కడ కనిపించే NTA NEET UG 2024 results అనే అక్షరాలు ఉన్న చోట క్లిక్ చేయాలి. ఆ వెంటనే మరో విండో ఓపెన్ అవుతుంది. అందులో ఇచ్చిన వివరాలను పొందుపర్చాలి. అనంతరం సబ్మిట్ బటన్‌ను క్లిక్ చేయాలి. నీట్ రిజల్స్ వెల్లడవుతాయి. ఫలితాలను తెలుసుకోవడానికి neet.ntaonline.in, ntaresults.nic.in, nta.ac.in అనే వెబ్‌సైట్ అందుబాటులో ఉన్నాయి.












Click it and Unblock the Notifications