80 గంటలు సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ రికార్డ్: అత్యల్ప కాలం సీఎంగా చేసింది వీరే
ముంబై: దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత ముఖ్యమంత్రిగా ఐదేళ్ల పాలనను తొలిసారి పూర్తి చేసిన దేవేంద్ర ఫడ్నవీస్.. నవంబర్ 9న మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి సంచలనం సృష్టించారు. గతంలో చివరిసారిగా వసంత్ రావు నాయక్ ఐదేళ్ల పాలనను పూర్తి చేశారు. ఆ తర్వాత దేవేంద్ర ఫడ్నవీస్ కావడం గమనార్హం.

దేవేంద్ర ఫడ్నవీస్ రికార్డ్..
అయితే, ఈ మైలురాయి అందుకున్న 17 రోజుల్లోనే దేవేంద్ర ఫడ్నవీస్ మరో చరిత్రను కూడా సృష్టించారు. మహారాష్ట్ర చరిత్రలోనే అత్యంత తక్కువ కాలం ముఖ్యమంత్రి పదవిలో కొనసాగిన వ్యక్తిగా కూడా దేవేంద్ర ఫడ్నవీస్ రికార్డుల్లొకెక్కారు. రెండోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ఫడ్నవీస్ కేవలం 80 గంటలు మాత్రమే ఆ పదవిలో కొనసాగడం గమనార్హం.

సీఎం, డిప్యూటీ సీఎం రాజీనామా
గత శనివారం ఎన్సీపీ నేత అజిత్ పవార్ మద్దతుతో దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. మంగళవారం వరకు తమకు మెజార్టీ ఉందని చెప్పుకొచ్చిన ఇద్దరు నేతలు కూడా మంగళవారం వారి పదవులకు రాజీనామా చేయడం గమనార్హం.

మూడో స్థానంలో ఫడ్నవీస్
ఈ పరిణామంతో దేవేంద్ర ఫడ్నవీస్ తక్కువ కాలం సీఎంగా పనిచేసిన వారి జాబితాలో చేరిపోయారు. 1947 నుంచి భారతదేశం మొత్తంమీద చూసుకున్నట్లయితే ఆయన మూడోస్థానంలో ఉన్నారు. దేవేంద్ర ఫడ్నవీస్ కంటే ముందు ఉత్తరప్రదేశ్ సీఎంగా పనిచేసిన జగదాంబికా పాల్, కర్ణాటక సీఎంగా చేస్తున్న బీఎస్ యడ్యూరప్ప ఉన్నారు.

జగదాంబికా పాల్ కేవలం 44గంటలే..
ముఖ్యమంత్రి పదవిలో జగదాంబికా పాల్ కేవలం 44 గంటలే కొనసాగడం గమనార్హం. 1998 ఫిబ్రవరిలో ఆయన సీఎంగా పనిచేశారు. ఇక ప్రస్తుత కర్ణాటక సీఎం బీఎస్ యడ్యూరప్ప గతంలో కర్ణాటక ముఖ్యమంత్రిగా కేవలం 55 గంటలే పనిచేశారు. ఎమ్మెల్యేల మద్దతు లేకపోవడంతో అక్కడ బీజేపీ ప్రభుత్వం కూలిపోయింది.

అత్యల్ప కాలం పనిచేసిన సీఎంలు..
ఇక ఓంప్రకాశ్ చౌతాలా ఆరు రోజులపాటు హర్యానా ముఖ్యమంత్రిగా కొనసాగారు. 1990 జులై 12 నుంచి 17 వరకు సీఎం పదవిలో ఉన్నారు. నితీష్ కుమార్ 8 రోజులపాటు బీహార్ ముఖ్యమంత్రిగా గతంలో పనిచేశారు. మార్చి 2000, 3-10 వరకు సీఎం పదవిలో కొనసాగారు. 2007 నవంబర్ 12-19 వరకు 8 రోజులపాటు బీఎస్ యడ్యూరప్ప 8 రోజులపాటు సీఎంగా కొనసాగారు. 1998 ఫిబ్రవరి 27- మార్చి 10 వరకు 12 రోజులపాటు ఎస్‌సీ మారక్ మేఘాలయా సీఎంగా పనిచేశారు.












Click it and Unblock the Notifications