
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ: కీలక విషయాలపై చర్చ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌ను కలిశారు. గురువారం వారణాసి పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరుకున్న ప్రధాని మోడీ.. సాయంత్రం రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి రామ్‌నాథ్ కోవింద్‌తో భేటీ అయ్యారు. పలు కీలక అంశాలపై ఆయనతో ప్రధాని చర్చించినట్లు రాష్ట్రపతి భవన్ తెలిపింది.
అయితే, ఏయే అంశాలపై రాష్ట్రపతితో చర్చించారనే విషయాలను మాత్రం వెల్లడించలేదు. జులై 19 నుంచి ఆగస్టు 13 వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీ రాష్ట్రపతిని కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

కాగా, ప్రధాని మోడీ గురువారం తన సొంత నియోజకవర్గమైన వారణాసిలో పర్యటించిన విషయం తెలిసిందే. రూ. 1500 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. కరోనా మహమ్మారి సెకండ్ వేవ్‌ను ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొందని ఈ సందర్భంగా ప్రధాని మోడీ ప్రశంసించారు.
వారణాసిలో నిర్మించిన రుద్రాక్ష కనెన్షన్ సెంటర్‌ను గురువారం ప్రధాని మోడీ ప్రారంభించారు. గత ఏడేళ్లుగా వారణాసిని అభివద్ధి చేస్తున్నామని, తాజా నిర్మాణంతో కాశీ పుణ్య క్షేత్రం మరింత వెలుగులీనుతుందని ప్రధాని వ్యాఖ్యానించారు.
అంతర్జాతీయ స్థాయి సమావేశాలు నిర్వహించుకునేందుకు వీలుగా జపాన్ టెక్నాలజీతో ఈ రుద్రాక్ష భవన నిర్మాణం చేపట్టారు. పర్యాటకులు, వ్యాపారవేత్తలను ఇది ఎంతగానో ఆకర్షిస్తుందని ప్రధాని మోడీ ఈ సందర్భంగా తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు వీలుగా స్టేజీ, సౌండింగ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేశాసినట్లు తెలిపారు.