బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ కు తుపాకీ లైసెన్స్... వాహనాన్ని మార్చిన హీరో
బాలీవుడ్ ప్రముఖ నటుడు, కండలవీరుడు సల్మాన్ ఖాన్ కు ముంబయి పోలీసులు తుపాకీ లైసెన్స్ జారీచేశారు. సల్మాన్ ఖాన్ ను, ఆయన తండ్రి సలీంఖాన్ ను హత్యచేస్తామంటూ బెదిరింపు లేఖ వచ్చిన నేపథ్యంలో ఆయనకు ఆయుధ లైసెన్స్ జారీచేసినట్లు పోలీసులు వెల్లడించారు. వెరిఫికేషన్ అంతా పూర్తిచేసి అనుమతి మంజూరు చేసినట్లు తెలిపారు. పంజాబ్ గాయకుడు సిద్ధూ మూసేవాలాకు పట్టిన గతే మీకు కూడా పడుతుందంటూ ఇద్దరికీ బెదిరింపు లేఖలు రావడం కలకలం రేకెత్తించిన సంగతి తెలిసిందే.
ప్రతిరోజు జాగింగ్ చేసిన తర్వాత కూర్చునే బెంచిపైన సల్మాన్ ఖాన్ కు, ఆయన తండ్రికి ఈ లేఖ లభించిందని పోలీసులు తెలిపారు. ''త్వరలో సిద్ధూ మూసేవాలా లాంటి పరిస్థితే మీకూ ఎదురవుతుంది'' అంటూ దుండగులు ఆ లేఖలో బెదిరించారు. అప్రమత్తమైన పోలీసులు ఆయనకు వ్యక్తిగతంగా, ఇంటిదగ్గర భద్రతను పెంచారు. జులై 22వ తేదీన సల్మాన్ ఖాన్ ముంబయి పోలీస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లి కమిషనర్ వివేక్ ఫాన్సాల్కర్ ను కలిశారు. వివేక్ తన పాత స్నేహితుడని, అందుకే కలిసినట్లు అప్పుడు సల్మాన్ తెలిపారు. అయితే ఆయన ఆయుధ లైసెన్స్ కోసమే కార్యాలయానికి వచ్చినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. తనను, తన కుటుంబాన్ని రక్షించుకునేందుకు తుపాకీని వెంట ఉంచుకోవడానికి దరఖాస్తు చేసుకున్నారని, లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలంటే ఫిజికల్ వెరిఫికేషన్ తప్పనిసరి కావడంతోనే ఆయన పోలీసు ప్రధాన కార్యాలయానికి వచ్చారంటూ తెలిపాయి.

సల్మాన్ ఖాన్ దరఖాస్తులపై దర్యాప్తు చేపట్టిన తర్వాత అతడికి అనుమతులు మంజూరు చేసినట్లు ముంబయి పోలీసులు వెల్లడించారు. సల్మాన్ కు బెదిరింపులు రావడం ఇదే తొలిసారి కాదు. 2018లో కృష్ణజింకల కేసు విచారణ జరుగుతున్న సమయంలో గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి హత్య చేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. దీంతో ఆయన తాను ఉపయోగించే వాహనాన్ని కూడా మార్చారు. ల్యాండ్ క్రూయిజర్ ను తీసుకొని దాన్ని బుల్లెట్ ప్రూఫ్ గా మార్చినట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications