పోలీసులపై దాడి: రౌడీ షీటర్‌పై కాల్పులు
బెంగళూరు: అరెస్టు చెయ్యడానికి వెళ్లిన సమయంలో పోలీసుల మీద ఎదురు దాడికి దిగిన రౌడిషీటర్ కు తూటా రుచి చూపించారు. సిటి మార్కెట్ సమీపంలోని కలాసిపాళ్యలో నివాసం ఉంటున్న సలీం అనే రౌడీ షీటర్ కాలిలో బుల్లెట్ దిగింది.
సలీం మీద బెంగళూరులోని అనేక పోలీస్ స్టేషన్ లలో కిడ్నాప్ లు, హత్యాయత్నాలు, చోరీలు, దారి దోపిడిలు, లూటీలు తదితర కేసులు నమోదు అయ్యాయి. రౌడీ షీటర్ల జాబితాలో సలీం పేరు ఉంది. చాలాకాలం నుండి ఇతను పోలీసుల కళ్లు గప్పి తప్పించుకుని తిరుగుతున్నాడు. ఆదివారం మఫ్టీ పోలీసులు గస్తి తిరిగారు.
ఆదివారం రాత్రి 10.30 గంటల సమయంలో సలీం జేసీ రోడ్డులో స్నేహితులతో కలిసి ఉన్న విషయం గుర్తించిన గస్తీ పోలీసులు వెంటనే ఇన్స్ పెక్టర్ అనిల్ కుమార్ కు సమాచారం అందించారు. అనిల్ కుమార్ జేసీ రోడ్డు చేరుకున్నారు.

ఆ సమయంలో సలీం పోలీసులను గుర్తించి పారిపోవడానికి ప్రయత్నించాడు. పోలీసులు అరెస్టు చెయ్యడానికి వెళ్లిన సమయంలో అతను డ్రాగెన్ తో దాడి చేశాడు. కానిస్టేబుల్ రెహమాన్ ఖాన్ చేతికి గాయం అయ్యింది. తరువాత సలీం బైక్ లో పారిపోవడానికి ప్రయత్నించాడు.
వెంటనే ఇన్స్ పెక్టర్ అనీల్ కుమార్ ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపాడు. సలీం ఎడమ కాలిలో బుల్లెట్ దూసుకు వెళ్లడంతో కుప్పకూలిపోయాడు. కానిస్టేబుల్ రెహమాన్ ఖాన్, నిందితుడు సలీంను విక్టోరియా ఆసుపత్రికి తరలించారు. నగర పోలీసు కమిషనర్ ఎం.ఎన్. రెడ్డి, డీసీపీ హేమంత్ నింబాళ్కర్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.












Click it and Unblock the Notifications