సెక్స్ వీడియో: ఎట్టకేలకు నోరు విప్పిన అమిత్ షా
Prajawal Revanna: రెండోదశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ను ఎదుర్కొంటోన్న కర్ణాటకలో సెక్స్ స్కాండల్ వీడియో సంచలనం రేపుతోంది. భారతీయ జనతా పార్టీ మిత్రపక్షం జనతాదళ్ (సెక్యులర్) చీఫ్, మాజీ ముఖ్యమంత్రి హెచ్ డీ కుమారస్వామి అన్న కొడుకు, నటుడు ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన వీడియో ఇది.
ఈ వీడియో వెలుగులోకి వచ్చిన తరువాత ప్రజ్వల్ రేవణ్ణ దేశ విడిచారు. జర్మనీకి వెళ్లిపోయారు. ఆయనను పార్టీ నుంచి బహిష్కరించింది జేడీఎస్. ఈ వీడియోపై అటు కర్ణాటక ప్రభుత్వం కూడా విచారణకు ఆదేశించింది. స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్‌ను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.

ఈ ఉదంతంపై తాజాగా బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. ఈ వ్యవహారంపై ఆయన మౌనం వీడటం ఇదే తొలిసారి కావడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రజల్ రేవణ్ణపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తోన్న కాంగ్రెస్ పార్టీపై ఎదురుదాడికి దిగారు.
ఈ వీడియోతో గానీ, ప్రజ్వల్‌పై చర్యలు తీసుకోవడంపై గానీ కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని అమిత్ షా తేల్చి చెప్పారు. కర్ణాటకలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీనేనని, ఆరోపణలను ఎదుర్కొంటోన్న నాయకుడిపై ఏవైనా చర్యలు తీసుకోవాల్సింది అక్కడి ప్రభుత్వమేనని స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం కావడం వల్ల కేంద్రం జోక్యం చేసుకోబోదనీ ఆయన అన్నారు. ఇప్పటివరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అమిత్ షా నిలదీశారు. ఈ కేసులో దర్యాప్తు మరింత ముమ్మరంగా సాగాలని తాము కోరుకుంటోన్నామని వివరించారు.
ఇప్పటికే నిందితుడిపై తమ మిత్రపక్షం జేడీఎస్ చర్యలు తీసుకుందని గుర్తు చేశారు. నేడు కోర్ కమిటీతో సమావేశం కానున్నామని, ఈ ఘటనపై ఎలా ముందుకు వెళ్లాలనేది నిర్ణయిస్తామని పేర్కొన్నారు. మాతృశక్తి నినాదానికి తాము కట్టుబడి ఉన్నామని, కోర్ కమిటీలో దీనిపైనే చర్చిస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications