బుల్లితెర 'ఆనంది' మృతిపై ప్రియుడు వెల్లడించిన నిజం
ముంబై: బుల్లితెర నటి ప్రత్యూష బెనర్జీ మృతి వ్యవహారంలో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అనుమాస్పద స్థితిలో ఆమె ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాను ఎంతగానో ప్రేమించిన ప్రియుడు రాహుల్ రాజ్ సింగ్ సింగ్‌తో అనుబంధం దెబ్బతినడం వల్లే ఆమె ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని అంటున్నారు.
మరోవైపు ఆమె మృతికి ప్రియుడు రాహుల్ రాజ్ సింగ్ కారణమని వార్తలు వచ్చిన నేపథ్యంలో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ముంబైలోని ఒక రహస్య ప్రదేశంలో అతడిని పోలీసులు విచారించినట్లుగా తెలుస్తోంది. ప్రత్యూష మృతి కేసులో అతని ప్రమేయం ఉందని కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు పోలీసులు అతని వాంగ్మూలాన్ని నమోదు చేశారు.
శుక్రవారం ఉదయం 10 గంటలకు తాను ఇంటినుంచి వెళ్లినప్పుడు ప్రత్యూష బాగానే ఉందని, కానీ సాయంత్రం 4 గంటలకు వచ్చి చూస్తే సీలింగ్‌కు ఫ్యాన్‌కు ఉరి వేసుకొని కనిపించిందని అతడు పోలీసుల విచారణలో వెల్లడించినట్టు తెలుస్తోంది.

'డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్‌లో మేమిద్దరం ఉండేవాళ్లం. మా వద్ద రెండు తాళం చెవిలు ఉండేవి. అందులో ఒకటి నా దగ్గర మరొకటి ప్రత్యూష దగ్గర ఉండేది. సాయంత్రం నేను ఇంట్లోకి రాగానే తను ఉరేసుకొని కనిపించింది. నేను భయపడ్డాను. వెంటనే చుట్టుపక్కల వారిని పిలిచి.. వారి సాయంతో ఆమెను కోకిలాబెన్ ఆసుపత్రికి తరలించాను. తను బతికే ఉందని మేం అనుకున్నాం, కానీ చనిపోయింది. దీంతో పోలీసులకు సమాచారమిచ్చేందుకు నేను భయపడ్డాను. ఆసుపత్రి అధికారులే ఈ విషయాన్ని పోలీసులకు తెలిపారు. వైద్యులు ప్రత్యూష చనిపోయినట్టు నిర్ధారించిన తర్వాత ఆమె కుటుంబసభ్యులకు, స్నేహితులకు ఫోన్ చేసి చెప్పాను' అని రాహుల్ సింగ్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు.
కాగా ప్రత్యూష మృతి కేసులో అతని ప్రమేయం ఉన్నట్లు కేసు నమోదు కాకపోవడంతో పోలీసులు అతడిని అధికారికంగా కస్టడీలోకి తీసుకోలేదని వార్తలు వస్తున్నాయి. ఇంట్లో పని చేస్తున్న పనిమనిషి, వాచ్‌మెన్‌ను సైతం పోలీసులు ప్రశ్నించారు. ఇందులో వీరిద్దరూ తరుచూ గొడవపడతుండేవారని తెలిసింది.
జంషెడ్‌పూర్‌కు చెందిన ప్రత్యూష బెనర్జీ 'బాలికావధు', 'బిగ్ బాస్ సీజన్7' ద్వారా ఎంతో పాప్యులారిటీ సంపాదించుకుంది. ముంబై శివార్లలోని బంగూర్‌నగర్‌లో ఉన్న సొంత ఫ్లాట్‌లో శుక్రవారం ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్రత్యూష మరణానికి గల కారణాలను ఇప్పుడే చెప్పలేమని, విచారిస్తున్నామని ముంబై పోలీసులు చెప్పారు.












Click it and Unblock the Notifications