ఎంత చీప్‌గా లెక్కేసుకున్నా టెస్లా ఆన్ రోడ్ రేటు 40 లక్షలు దాటుతోంది భయ్యా
Tesla car price in India: అపర కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ.. భారత్‌లో అరంగేట్రం చేయడానికి సన్నాహాలు మొదలుపెట్టింది. త్వరలోనే తొలి కారు మన రోడ్లపై దూసుకుపోవడం ఖాయంగా కనిపిస్తోంది. లగ్జరీ కార్లకు పట్టం కట్టే కొనుగోలుదారులు ఈ టెస్లా కారు ఆదరిస్తారనడంలో సందేహాలు అక్కర్లేదు.
అంచనాలకు మించి..
భారత్‌లో టెస్లా కారు ధర ఎలా ఉండొచ్చనే విషయంపై క్యాపిటల్ మార్కెట్ అండ్ ఇన్వెస్టిమెంట్ సంస్థ సీఎల్ఎస్‌ఏ తాజాగా ఓ నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం చూస్తే టెస్లా కారు ధర అంచనాలకు మించిపోతోంది. దిగుమతి సుంకాలను 20 శాతం కంటే తగ్గించినప్పటికీ కూడా టెస్లా చీపెస్ట్ మోడల్ కారు ధర 35 నుంచి 40 లక్షల వరకు ఉంటుంది.

40,000 డాలర్ల వరకు..
అమెరికాలో టెస్లా హైఎండ్ మోడల్ 3 కారు రేటు ప్రస్తుతం దాదాపు 35,000 డాలర్లు ఉంటోంది. దీన్ని కరెన్సీలోకి మార్చుకుంటే 30.4 లక్షల రూపాయల పైమాటే. భారత్‌లో దిగుమతి సుంకాలు 15 నుంచి 20 శాతానికి తగ్గించిన తరువాత కూడా రోడ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్ వంట ఇతర ఖర్చులను కలుపుకొని ఆన్ రోడ్ ధర ఇప్పటికే 40,000 డాలర్లను దాటుతోంది.
ఇతర కార్ల కంటే..
దీని విలువ భారత కరెన్సీలో పోల్చుకుంటే దాదాపు 35 నుంచి 40 లక్షల రూపాయలు. టెస్లా మోడల్ 3 ధరను దేశీయ ఎలక్ట్రిక్ కార్లు- మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈ, హ్యుండాయ్ ఇ-క్రెటా, మారుతి సుజుకి ఇ-విటారాతో పోల్చుకుంటే 20 నుంచ 50 శాతం అధికంగా ఉంటోంది టెస్లా ఈవీ కారు ధర. ఇది- టెస్లా కారు డిమాండ్‌ను ప్రభావితం చేస్తుందని సీఎల్ఎస్ఏ అభిప్రాయపడింది.
బడ్జెట్ ఫ్రెండ్లీ..
25 లక్షల రూపాయలు లేదా అంత కంటే తక్కువ ధర ఉంటేనే టెస్లా ఈవీ కారుకు మంచి మార్కెట్ ఉండొచ్చని పేర్కొంది. ఆన్ రోడ్ ధర బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటేనే కొనుగోలుదారులు మొగ్గు చూపుతారని వివరించింది. అయినప్పటికీ- టెస్లా రాక తరువాత దేశీయ ఆటోమోటివ్ సెగ్మెంట్‌లో ఓ విప్లవాత్మక మార్పునకు బీజం పడుతుందని సీఎల్ఎస్ఏ తెలిపింది.
రూ. 4,150 కోట్లకు పైగా పెట్టుబడి పెడితే
ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే విధానపర నిర్ణయాలను తీసుకున్న విషయం తెలిసిందే. దీని ప్రకారం- భారత్‌లో టెస్లా 4,150 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టగలిగితే- సంవత్సరానికి 8,000 యూనిట్ల వరకు 15 శాతం తక్కువ దిగుమతి సుంకాన్ని పొందే వెసలుబాటు ఉంటుంది.












Click it and Unblock the Notifications