రాహుల్‌కు అదే పాత బంగళా- 8 రోజులే గడువు: అచ్చిరావట్లేదంటోన్న కాంగ్రెస్
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న నేపథ్యంలో- అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత, వాయనాడ్ లోక్‌సభ సభ్యుడు రాహుల్ గాంధీ.. యాక్టివ్ మోడ్‌లోకి వచ్చారు. మోదీ ఇంటిపేరు వ్యవహారంలో ఆయనను దోషిగా నిర్ధారిస్తూ సూరత్ కోర్టు ఇచ్చిన ఆదేశాలపై దేశ అత్యున్నత న్యాయస్థానం స్టే ఇవ్వడం, ఆ వెంటనే అనర్హత వేటు తొలగిపోవడం వంటి పరిణామాలు కాంగ్రెస్‌లో జోష్ నింపాయి.
అనర్హత వేటును ఎత్తేసిన తరువాత తొలిసారిగా కేరళలోని వాయనాడ్‌కు వెళ్లనున్నారు రాహుల్ గాంధీ. ఈ నెల 12, 13 తేదీల్లో వాయనాడ్‌లో పర్యటించనున్నారు. ఇది ఆయన సొంత నియోజకవర్గం. 2019 ఎన్నికల్లో వాయనాడ్ నుంచి ఆయన లోక్‌సభ ఎన్నికైన విషయం తెలిసిందే.

అనర్హత వేటు పడినప్పుడూ ఆయన వాయనాడ్‌లో పర్యటించారు. తనను గెలిపించిన మలయాళీలకు కృతజ్ఞతలు తెలుపుకొన్నారు అప్పట్లో. ఇప్పుడు మరోసారి సొంత నియోజకవర్గానికి వెళ్లనున్నారు. 12, 13 తేదీల్లో ఆయన షెడ్యూల్ ఖరారైనట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. రోడ్ షోలో పాల్గొంటారని, బహిరంగ సభలో ప్రసంగిస్తారని పేర్కొన్నారు.
అనర్హత వేటు ఎత్తేసిన నేపథ్యంలో.. రాహుల్ గాంధీకి లోక్‌సభ సెక్రెటేరియట్ బంగళాను కేటాయించింది. తుగ్లక్ రోడ్‌లోని నంబర్ 12 బంగళాను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఇక్కడే నివాసించారు రాహుల్ గాంధీ. అనర్హత వేటు పడినప్పుడు ఈ బంగళానే ఖాళీ చేశారాయన. ఇప్పటి వరకు అది ఖాళీగానే ఉంది.
లోక్‌సభలో రాహుల్ మళ్లీ అడుగుపెట్టిన నేపథ్యంలో ఆయనకు మళ్లీ అదే బంగళాను కేటాయించారు. ఈ మేరకు లోక్‌సభ సెక్రెటేరియట్.. ఏఐసీసీ కార్యాలయానికి నోట్ పంపించింది. అదే బంగళాలో నివసించాలా? వద్దా? అనేది రాహుల్ గాంధీ తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంది. ఎనిమిది రోజుల్లోగా తన నిర్ణయాన్ని లోక్‌సభకు తెలియజేయాల్సి ఉందాయనకు.
నంబర్ 12, తుగ్లక్ రోడ్ బంగళాలో రాహుల్ గాంధీ 20 సంవత్సరాల పాటు నివసించారు. 2004 నుంచి వరుసగా లోక్‌సభకు ఎన్నికవుతూ వస్తోన్న రాహుల్‌కు ఆ ఏడాది తొలిసారిగా ఈ బంగళాను లోక్‌సభ సెక్రెటేరియట్ కేటాయించింది. అనర్హత వేటు పడిన నేపథ్యంలో దాన్ని వీడాల్సి వచ్చింది.
ఇప్పుడు మళ్లీ అదే బంగళా దక్కింది. అందులో నివసించడానికి ఇష్టపడతారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ఈ బంగళా ఆయనకు అచ్చిరావట్లేదనే అభిప్రాయం కాంగ్రెస్ నేతల్లో వ్యక్తమౌతోంది. పార్టీకి పరాజయాలు వీడట్లేదని, 2019 ఎన్నికల్లో అమేథీ నియోజకవర్గంలో రాహుల్ గాంధీ సైతం ఓటమి చవి చూడాల్సి వచ్చిందని, అందుకే కొత్త బంగళా ఉంటే బాగుంటుందని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications