రాహుల్ గాంధీ డిమాండ్ అదొక్కటే
Hathras Stampede: ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకున్న హత్రాస్ తొక్కిసలాట దుర్ఘటన దుమారం రేపుతోంది. ఈ ఘటనలో 121 మంది మరణించడం రాజకీయంగా భూకంపాన్ని పుట్టించింది. అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ వైఫల్యంగా అభివర్ణిస్తోన్నాయి అక్కడి ప్రతిపక్ష పార్టీలు. మృతుల కుటుంబాల తరఫున ధర్నాలు, ఆందోళనలకు పిలుపునిచ్చాయి.
హత్రాస్‌లో ఏర్పాటు చేసిన ఓ సత్సంగ్ సభలో ఈ తొక్కిసలాట సంభవించిన విషయం తెలిసిందే. 121 మంది దుర్మరణం పాలయ్యారు. పలువురు గాయపడ్డారు. దీన్ని నిర్వహించిన సూరజ్ పల్ అలియాస్ భోలే బాబా పాద ధూళిని స్వీకరించడం కోసం భక్తులు ఎగబడటం తొక్కిసలాటకు దారి తీసింది. ప్రస్తుతం బాబా పరారీలో ఉన్నారు. ఆయన కోసం ఉత్తర ప్రదేశ్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలను కాంగ్రెస్ నేత, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పరామర్శించారు. వారికి సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన వారికి ధైర్యం చెప్పారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తరఫున తక్షణ సహాయం అందేలా చేస్తామని హామీ ఇచ్చారు. పార్టీ తరఫున ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
ఈ ఉదయం ఆయన ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో లక్నోకు బయలుదేరి వెళ్లారు. అక్కడి నుంచి నేరుగా రోడ్డు మార్గంలో హత్రాస్, అలీగఢ్ చేరుకున్నారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు. బాధితులు తమ పరిస్థితులను రాహుల్ గాంధీకి వివరించారు. సత్సంగ్ కోసం వెళ్లిన కుటుంబ సభ్యులు తిరిగి రాలేదంటూ కన్నీరు పెట్టుకున్నారు.
అనంతరం రాహుల్ గాంధీ విలేకరులతో మాట్లాడారు. హత్రాస్ తొక్కిసలాటను పెను దుర్ఘటనగా అభివర్ణించారు. దీన్ని రాజకీయం చేయదలచుకోలేదని అన్నారు. ప్రభుత్వం, అధికార యంత్రాంగం లోపం వల్లే ఈ దుర్ఘటనకు కారణమని పేర్కొన్నారు. వందలాదిమంది భక్తులు వస్తారని ముందుగానే తెలిసినప్పటికీ- సరైన ఏర్పాట్లు చేయడంలో విఫలం అయ్యారని చెప్పారు.

మృతులు, గాయపడ్డ వారందరూ పేద కుటుంబాలకు చెందిన వారని, గరిష్ఠ ఆర్థిక సహాయం ప్రకటించాలని ఆయన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నష్ట పరిహారాన్ని ప్రకటించే విషయంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. మానవతాదృక్పథంతో వ్యవహరించాలని సూచించారు.
నష్ట పరిహారం మొత్తం తక్షణమే అందేలా చూడాలని, ఇందులో జాప్యం జరిగితే ఆ కుటుంబాలకు ఎలాంటి ప్రయోజనం ఉండబోదని రాహుల్ గాంధీ అన్నారు. తొక్కిసలాట తరువాత కూడా పోలీసులు సకాలంలో సంఘటన స్థలానికి చేరుకోలేకపోయారంటూ బాధితులు చెప్పారని, ఇది తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications