ద్వేషాన్ని తరిమేశాం- ప్రేమను గెలిచాం- కర్నాటక సీఎం ప్రమాణ కార్యక్రమంలో రాహుల్..
కర్నాటక సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కీలక ప్రసంగం చేశారు. ముఖ్యంగా కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు, విద్వేష రాజకీయాలకు సంబంధించి రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. రాష్ట్రంలో విద్వేషాన్ని తరిమేసి, ప్రేమను ఎలా గెలిచామన్న దానిపై రాహుల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కొత్త ప్రభుత్వానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి పేదలు, ఆదివాసీలు, ఎస్సీల మద్దతే కారణమని రాహుల్ గాంధీ వెల్లడించారు. అలాగే గత ఐదేళ్లలో తాము కర్నాటకలో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నామో మీకు తెలుసని కాంగ్రెస్ శ్రేణుల్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కర్నాటకలో కాంగ్రెస్ గెలిచాక చాలా విశ్లేషణలు వచ్చాయని, కాంగ్రెస్ గెలుపుకు చాలా మంది చాలా కారణాలు చెప్పారని రాహుల్ గుర్తుచేశారు. కానీ పేదలు, దళితులు, ఆదివాసీల వల్లే తాము గెలిచామన్నారు.

తమ వద్ద డబ్బు లేదని, కేవలం పేదల ప్రేమ మాత్రమే ఉందని రాహుల్ తెలిపారు. కానీ బీజేపీ వద్ద డబ్బు ఉందని, అధికార గర్వం ఉందన్నారు. అలాగే రాష్ట్రంలో బీజేపీ చేసిన విద్వేష రాజకీయాల్ని సైతం రాహుల్ గుర్తుచేశారు. ఈసారి కర్నాటక ఎన్నికల్లో రాష్ట్రం నుంచి తాము విద్వేషాన్ని తరిమేశామని, ప్రజల ప్రేమను గెలిచామని రాహుల్ తెలిపారు. కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం స్వచ్చమైన, అవినీతి రహిత పాలన అందిస్తుందని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.
ఎన్నికల్లో తాము ఇచ్చిన ఐదు కీలక హామీల్ని మరికొద్ది గంటల్లో జరిగే తొలి కేబినెట్ భేటీలోనే ఆమోదిస్తామన్నారు. ఇప్పటికే సీఎం సిద్దరామయ్యతో పాటు కాంగ్రెస్ కీలక నేతలంతా ఈ హామీల్ని తొలి కేబినెట్లోనే అమలు చేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో తొలి కేబినెట్ భేటీపై ఆసక్తి నెలకొంది.












Click it and Unblock the Notifications