మార్కెట్ లో పెప్సీ, కోకాకోలా పనైపోయినట్లే??
భారత మార్కెట్‌లో గుత్తాధిపత్యం చెలాయిస్తున్న పెప్సీ, కోకా కోలాకు పోటీగా మరో డ్రింక్ రాబోతోంది. అది తెస్తుంది ఎవరో కాదు.. ఆసియా కుబేరుడు, రిలయన్స్ గ్రూప్ అధినేత ముఖేష్ అంబానీ. తాజాగా ఆ కంపెనీ ఢిల్లీకి చెందిన కాంపా, సోస్యో సాఫ్ట్ డ్రింక్స్ బ్రాండ్‌ను కొనుగోలు చేసింది. ఇవి ప్యూర్ డ్రింక్ గ్రూప్ చేతిలో ఉన్నాయి. రూ.22 కోట్లకు కొనుగోలు జరిగినట్లు ఆంగ్ల మీడియా వెల్లడించింది. ఎఫ్ఎంసీజీ వ్యాపారంలోకి అడుగు పెడుతున్నామని రియలన్స్ ప్రకటించిన రెండురోజుల్లోనే ఈ కొనుగోలు జరగడం గమనార్హం. పెప్సీ, కోలాకు పోటీగా కాంపాను రిలయన్స్ తీసుకురాబోతోంది.
ఎఫ్ఎంసీజీ వ్యాపారంలోకి అడుగు పెడుతున్నట్లు రిలయన్స్ ఏజీఎం సమావేశంలో రిటైల్ వెంచర్ లిమిటెడ్ డైరెక్టర్ ఈశా అంబానీ తెలిపారు. ఇప్పటికే ఈ రంగంలో బ్రిటానియా, నెస్లే, హిందూస్థాన్ యూనీలీవర్ అగ్రగామి కంపెనీలుగా కొనసాగుతున్నాయి. వేగంగా విస్తరిస్తోన్న ఎఫ్ ఎంసీజీలోకి అడుగుపెట్టాలని భావిస్తోన్న రిలయన్స్ కాంపాను కొనుగోలు చేసింది. ఈ ఏడాది దీపావళికి కాంపా బ్రాండ్‌ను విడుదల చేయాలని రిలయన్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. జియో మార్ట్, కిరాణా స్టోర్స్, రిలయన్స్ రిటైల్స్ లో వీటిని విక్రయానికి ఉంచుతారు.

పార్లే కంపెనీ 1990లో థమ్స్ అప్, గోల్డ్ స్పాట్, లిమ్కా తీసుకొచ్చింది. మార్కెట్‌లో వీటితోపాటు కాంపా కూడా ఓ వెలుగు వెలిగింది. పార్లేకు చెందిన ఆగ్రో బ్రాండ్లను కోకా కోలా ఎప్పుడైతే కొనుగోలు చేసిందో అప్పటి నుంచి కాంపా మార్కెట్ నుంచి అంతర్థానమైంది. ఆ తర్వాత చాలాసార్లు మార్కెట్‌లోకి తిరిగి రావడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ విజయవంతమవలేకపోయింది. ఇప్పుడు దీన్ని రిలయన్స్ కొనుగోలు చేయడంద్వారా మార్కెట్‌లోకి తిరిగి ఘనంగా పునరాగమనం చేయబోతోంది.












Click it and Unblock the Notifications