వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెరుగుతున్న ద్రవ్యోల్బణం, పడిపోతున్న రూపాయి విలువ... మీ జేబుపై పడే భారమెంత?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
ద్రవ్యోల్బణం

పెట్రోల్ ధరలు... ద్రవ్యోల్బణం.. రూపాయి విలువ పతనం.

3 నెలలు... 3 మార్పులు

మీ జేబుకు చిల్లు పెట్టేశాయి

మీ బడ్జెట్‌ను తారుమారు చేశాయి.

నిజానికి, రెండేళ్ల కోవిడ్ తర్వాత కొత్త ఏడాది బాగానే మొదలయ్యింది. కోవిడ్ ప్రభావం నుంచి కోలుకుంటున్నామన్న భరోసా కాస్తో కూస్తో కనిపించేది.

దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల కారణంగా ఇంధన కంపెనీలు కొన్ని వారాల పాటు పెట్రోల్ ధరల పెంపు ఊసే మర్చిపోయాయి.

కానీ సరిగ్గా ఫిబ్రవరి 24 యుక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించింది రష్యా...

ఓ రకంగా మళ్లీ కష్టాలకు బీజం పడింది అప్పుడే. ప్రపంచ వ్యాప్తంగా పెట్రోల్ ఉత్పత్తుల ఎగుమతుల్లో రష్యా పాత్ర కీలకం. యూరోపియన్ దేశాలు ఆ దేశంపై విధించిన ఆంక్షల ప్రభావం పెట్రోల్ ఉత్పత్తుల ధరలపై కూడ పడింది.

ఎన్నికల ఫలితాలు వచ్చేంత వరకు ఎలాగోలా పెట్రోల్ ధరలు పెంచకుండా ఆగిన కంపెనీలు...వచ్చిన కొద్ది రోజులకే అంటే మార్చి 22న తొలిసారి ధరలు పెంచాయి. నిజానికి 2022 ఏడాది ప్రారంభమైన తర్వాత అదే తొలిసారి పెంచడం.

అప్పటి వరకు కొన్ని వారాలపాటు హైదరాబాద్‌లో 108 రూపాయలకు అటూ ఇటూగా ఉన్న లీటర్ పెట్రోల్ ధర అప్పటి నుంచి పెరగడం మొదలయ్యింది. అలా సుమారు 2 నెలల కాలంలో అంటే మే 11 నాటికి 119.49పైసలకు చేరింది. పెట్రోల్‌ పెరిగిందంటే డీజిల్ కూడా పెరుగుతుంది.

మార్చి 21 నాటికి హైదరాబాద్‌లో 94.61 పైసలు ఉన్న లీటర్ డీజిల్ ధర, మే 11 నాటికి 105.47 పైసలకు చేరింది. రష్యా సుదీర్ఘ కాలం యుక్రెయిన్‌పై యుద్ధాన్ని కొనసాగించాలని భావిస్తోందన్న వార్తలు వస్తుండటం, దేశంలో డిసెంబర్ వరకు ఎన్నికలు లేవు కాబట్టి మున్ముందు పెట్రో ఉత్పత్తుల ధరలు పైపైకే వెళ్తాయి. ఏదో అద్భుతం జరిగితే తప్ప కిందకు దిగే సూచనలు లేవు.

ఇంధన ధరలు పెరిగితే నిత్యావసరాలన్నీ పెరగడం సర్వ సాధారణం. దేశంలో ఇప్పుడు అదే జరిగింది. అయితే అదొక్కటే కాదు.. అంతర్జాతీయంగా కమొడిటీస్ ధరలు భారీగా పెరగడం కూడా దేశంలో ధరల పెరుగుదలకు మరో ముఖ్యమైన కారణం.

వంట నూనెలు ,పెట్రోలియం ఉత్పత్తులు, ఎరువులు, ఎలక్ట్రానిక్ ముడి పరికరాలు, ఐరన్, స్టీలు, హెవీ మెషినరీ, ప్లాస్టిక్ ఇలా నిత్యం మనం ఉపయోగించే అన్ని వస్తువుల విషయంలోనూ మనం దిగుమతులపైనే ఆధారపడ్డాం.

రష్యా-యుక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రపంచంలోనే సన్ ఫ్లవర్ ఆయిల్ అత్యధికంగా ఉత్పత్తి చేసే యుక్రెయిన్‌ నుంచి దిగుమతులు ఆగిపోయాయి. పామాయిల్, సోయాబీన్ ఆయిల్ వంటి వంటనూనెలల్ని అధికంగా ఎగుమతి చేసే ఇండోనేషియా, అర్జెంటీనా దేశాలు ఎగుమతుల్ని నిలిపేశాయి.

బిజినెస్ స్టాండర్డ్ ప్రచురించిన నివేదిక ప్రకారం, భారత్ ప్రతీ ఏడాది 1.3 కోట్ల టన్నుల వంటనూనెను దిగుమతి చేసుకుంటుంది. అందులో 63 శాతం పామాయిల్ ఉంటుంది. ఇందులో అధికభాగం ఇండోనేసియా నుంచే దిగుమతి చేసుకుంటుంది. మలేసియా, థాయ్‌లాండ్ దేశాల నుంచి కూడా కొంతస్థాయిలో పామాయిల్‌ను కొనుగోలు చేస్తుంది.

అయితే దేశీయ కొరతను నివారించుకునేందుకు ఇండోనేషియా పామాయిల్ ఎగుమతులపై నిషేధం విధించింది దాంతో ఒక్కసారిగా వంటనూనెల ధరలు మన దేశంలో ఆకాశాన్నంటాయి.

మరోవైపు హీట్ వేవ్ కూడా దేశంలో వ్యవసాయ ఉత్పత్తులపై ప్రభావం చూపిస్తున్నాయి. ఇప్పటికే ఉత్తరాదిలో గోదుమ పంటపై ఆ ప్రభావం పడింది. అదే సమయంలో ప్రపంచంలోనే గోదుమ ఎగుమతుల్లో మొదటి వరుసలో ఉండే రష్యా-యుక్రెయిన్‌ దేశాల నుంచి దిగుమతులు ఆగిపోయాయి.

ఫలితంగా గోదుమ ధరలు కూడా పెరగడం మొదలయ్యింది. మొత్తంగా అదీ ఇదీ అని కాదు... అన్ని ధరల్లోనూ పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోంది.

పెట్రోలు ధరలు

ద్రవ్యోల్బణం

సరిగ్గా ఈ అస్తవ్యస్థ పరిస్థితులే ద్రవ్యోల్బణం పెరగడానికి కారణం. భారత్‌లో ద్రవ్యోల్బణం 18 నెలల గరిష్ట స్థాయికి చేరనుందని రాయిటర్స్, ఇన్విస్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఆఫ్ ఇండియా సహా ప్రముఖ జాతీయ బ్యాంకుల అంచనా వేశాయి.

అనుకున్నట్లుగానే దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం ఎనిమిదేళ్ల గరిష్ట స్థాయికి చేరుకుంది. ఈ రోజు(మే 12) విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఏప్రిల్‌ లో ద్రవ్యోల్బణం 7.79 శాతం.

ఆహార పదార్థాలు, చమురు ధరల పెరుగుదల కారణంగా ద్రవ్యోల్బణంలో ఈ పెరుగుదల కనిపించింది. ఈ స్థాయి రిటైల్ ద్రవ్యోల్బణం మే 2014 తర్వాత నమోదు కాలేదు. అప్పుడు రిటైల్ ద్రవ్యోల్బణం 8.33 శాతంగా నమోదైంది.

ఇదే సమయంలో గత ఏడాదితో పోలిస్తే రిటైల్ ద్రవ్యోల్బణం రేటులో చాలా వ్యత్యాసం కనిపించింది. ఏప్రిల్ 2021లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.21 శాతంగా ఉంది.

రిటైల్ ద్రవ్యోల్బణం వరుసగా నాలుగు నెలల పాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థిర పరిమితి 6 శాతం కంటే ఎక్కువగా ఉంది.

ఇప్పుడు ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను మార్చేందుకు అవకాశాలు పెరిగాయి. ఈ కారణంగా రాబోయే రోజుల్లో రుణాలు మరింత ప్రియం కావచ్చు.

రెపో రేటును 0.40 శాతం నుంచి 4.40 శాతానికి పెంచుతున్నట్లు మే 4న ఆర్బీఐ ప్రకటించింది. దీంతో పాటు నగదు నిల్వల నిష్పత్తిని 0.50 శాతం పెంచుతూ ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంది. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు బ్యాంకు ఈ చర్యలు చేపట్టింది.

నిజానికి మార్చి నెలలో 6.95 శాతంతో 17 నెలల గరిష్ట స్థాయికి చేరుకుంది ద్రవ్యోల్బణం. అంతర్జాతీయంగానూ కమోడిటీస్ మార్కెట్ సంక్షోభం, ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వ తీసుకుంటున్న నిర్ణయాలు కూడా ద్రవ్యోల్బణం పెరగడానికి కారణమని ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు డి.పాపారావు బీబీసీతో అన్నారు.

రూపాయి పతనం

"యుక్రెయిన్-రష్యా యుద్ధం వల్ల మనం ఎక్కువగా దిగుమతి చేసుకునే చమురు, వంటనూనెలు, ఎరువులు, గోధుమలు ఇలా అన్ని ధరలు పెరుగుతూ వస్తున్నాయి. అదే సమయంలో ఇండోనేషియా పామాయిల్ ఎగుమతులపై నిషేధం విధించింది. అయితే వాటితో పాటు భారత ప్రభుత్వం తీసుకుంటున్నతప్పుడు నిర్ణయాలు కూడా ధరల పెరుగుదలకు కారణం. ముఖ్యంగా పెట్రో ఉత్పత్తులపై విధిస్తున్న ఎక్సైజ్ డ్యూటీల వల్ల కూడా రవాణారంగంపై భారంపై ధరలు పెరుగుదలకు కారణమవుతున్నాయి’’ అని పాపారావు బీబీసీతో అన్నారు.

''గోదుమల విషయానికి వస్తే ఓ వైపు హీట్ వేవ్ కారణంగా దేశంలో ఉత్పత్తి తగ్గింది. అటు రష్యా నుంచి దిగుమతులు కూడా తగ్గాయి. ఇదే సమయంలో మనం బియ్యం, గోధుమల ఎగుమతుల్ని భారీగా పెంచాం. ప్రస్తుతానికి ఎఫ్‌సీఐ గోడౌన్లలో బియ్యం నిల్వలు భారీగా ఉన్నందున బియ్యం కొరత రాకపోయినా గోదుమలకు మాత్రం కొరత వచ్చే ప్రమాదం ఉంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా పిండి ధరలు పెరిగాయి. ఈ విధానాలు కూడా దేశంలో ద్రవ్యోల్బణం పెరగడానికి కారణాలు’’ అని పాపారావు చెప్పారు.

రూపాయి నేల చూపులు

కోవిడ్ అనంతర పరిస్థితుల ప్రభావం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అన్ని మార్కెట్లపైనా ఉంది. దానికి రష్యా-యుక్రెయిన్ యుద్ధం కూడా తోడయ్యింది. ఫలితంగా దేశీయ కరెన్సీ రూపాయి తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతోంది. దీంతో మే 9 నాటికి అమెరికన్ డాలర్ విలువతో పోల్చితే 77 రూపాయల 44 పైసల కనిష్ఠ స్థాయికి పడిపోయి కంగారు పుట్టించింది.

ఆ తర్వాత మళ్లీ కోలుకున్నప్పటికీ మే 11 నాటికి 77 రూపాయల 22 పైసల వద్ద కొనసాగుతూ వచ్చింది. ఇప్పటికే ద్రవ్యోల్బణం పెరగడం, దానికి తోడు రూపాయి విలువ కూడా అంతర్జాతీయ మార్కెట్లో రికార్డు స్థాయిలో పడిపోవడంతో ఆందోళనక పరిస్థితులు నెలకొన్నాయి.

రెపో రేటు-ఆర్బీఐ

సామాన్యుడి పరిస్థితి ఏంటి?

ఓ వైపు పెట్రోల్ ఉత్పత్తులు, మరోవైపు నిత్యావసరాల ధరలు, ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచడం, రూపాయి పడిపోవడం.. ఇవన్నీ మనకు సంబంధంలేని విషయాల్లా కనిపిస్తాయి కానీ... చివరకు ఆ భారం మోసేది సామాన్యుడే.

ఇప్పటికే పెట్రోల్ ధరలు, నిత్యావసర ధరలు పెరగడం వల్ల సామాన్యుడి బడ్జెట్‌పై నెలకు సుమారు వెయ్యి రూపాయల నుంచి 2 వేల రూపాయల వరకు భారం పడింది. దానికి తోడు దేశ ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకొని ఆర్బీఐ తాజాగా తీసుకున్న నిర్ణయం కారణంగా వ్యక్తిగత రుణాలు, గృహరుణాలు, క్రెడిట్ కార్డులపై రుణాలు తీసుకున్న వారిపై అదనంగా మరింత భారం తప్పదు.

ఉదాహరణకు మీరు 50 లక్షల రూపాయల గృహ రుణం 7 శాతం వడ్డీ చొప్పున 20 ఏళ్లకు తీసుకున్నట్టయితే ప్రస్తుతం మీరు నెల నెలా 38వేల765 రూపాయలు వాయిదా కట్టాల్సి ఉంటుంది. అదే వడ్డీ రేటు 7.4 శాతానికి పెరిగినట్టయితే అదే మొత్తానికి నెలకు మీరు చెల్లించాల్సిన వాయిదా మొత్తం 39వేల974 రూపాయలకు పెరుగుతుంది.

అంటే మీ నెలవారీ బడ్జెట్‌పై సుమారు 1200 రూపాయలు అదనపు భారం పడనుంది. ఇక కారు రుణం, వ్యక్తిగత రుణాలు కూడా తీసుకున్నట్టయితే ఆ భారం మరింత అదనం. మీరు రుణం తీసుకున్న బ్యాంకు నిబంధనలను అనుసరించి ఈ మొత్తంలో మార్పులు కూడా ఉండవచ్చు.

అంతేకాదు...రూపాయి విలువ పడిపోవడం వల్ల ఆ ప్రభావం మనం దిగుమతి చేసుకునే వస్తువులన్నింటిపైనా పడుతుంది. ఫలితంగా కార్ల విడిభాగాలు, ఏసీలు, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్ ఫోన్లు, స్టీల్, ఐరన్ ఉత్పత్తులు, ఎల్ఈడీ టీవీలు, కంప్యూటర్ విడిభాగాలు ఇలా వీటన్నింటి ధరలు పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

అంటే ఆ భారం కూడా పడేది సామాన్యుడి జేబుపైనే.

కరెంటు చార్జీలు

చార్జీల మోత

వాటితో పాటు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఇప్పటికే కరెంటు చార్జీలు బాగానే పెంచాయి రెండు ప్రభుత్వాలు. వాటి ప్రభావం ఏప్రిల్ నెల కరెంటు బిల్లుల్లో కనిపించడం మొదలయ్యింది. గత నెలలో రెండు రాష్ట్రాలు ఆర్టీసీ బస్సు చార్జీలను కూడా పెంచేశాయి. అంటే ఈ భారాన్ని మోస్తున్నది కూడా ప్రజలే.

అయితే ఇది కేవలం ఒక్క భారత దేశంలో మాత్రమే కాదు...ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. అయితే ఆసియాలోనే బలమైన ఆర్థిక వ్యవస్థల్లో మనది కూడా ఒకటి కాబట్టి తట్టుకోగల్గుతున్నామని హైదరాబాద్‌కు చెందిన బిజినెస్ ఎనలిస్ట్ నాగేంద్ర సాయి బీబీసీతో అన్నారు.

"నిజానికి జపాన్, బ్రిటన్, యూరోపియన్ యూనియన్ కరెన్సీలతో పోల్చితే రూపాయి బాగానే బలంగానే ఉంది. అంతర్జాతీయ అమెరికన్ డాలర్ బాగా బలపడటం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. రష్యా-యుక్రెయిన్ యుద్ధం మరి కొన్ని నెలలు కొనసాగినా లేదా యుక్రెయిన్ విషయంలో రష్యా తీవ్రమైన చర్యలు తీసుకున్నా ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు మరింత కుదేలయ్యే ప్రమాదం పొంచి ఉంది’’ అని నాగేంద్ర సాయి అభిప్రాయపడ్డారు.

''మన దేశంలో ద్రవ్యోల్బణం విషయానికి వస్తే ఇదే పరిస్థితి మరి కొన్ని నెలల పాటు కొనసాగవచ్చు. అందుకు మనం సిద్ధమై ఉండాల్సిందే. ఒక్క మాటలో చెప్పాలంటే కోవిడ్ సంక్షోభం నెలకొన్న రెండేళ్ల పాటు ప్రపంచ దేశాలన్నీ ఏదో రకంగా ప్రజలకు డబ్బులు పంచిపెట్టాయి. తిరిగి వాటిని వసూలు చేసుకునేంత వరకు ఈ పరిస్థితి తప్పదు" అని సాయి అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Rising inflation, falling rupee,How much burden is on your pocket
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X