పోస్ట్ : పని మనిషి.. నెలకు రూ.50వేల జీతం, ఏటా హైక్స్..!!!
యులియా అస్లమోవా.. రష్యాకు చెందిన ఈమె ఒక కంటెంట్ క్రియేటర్. గత 12 ఏళ్లుగా బెంగళూరులో నివసిస్తూ ఉద్యోగం చేస్తున్నారు. ఆమె తన భర్త, కుమార్తెతో కలిసి ఉంటున్నారు. అయితే లేటెస్ట్ గా అస్లామోవా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తన కుమార్తె ఎలెనాకు నానీగా పని చేస్తున్న గృహ సహాయకురాలికి నెలకు రూ.50,000 జీతం ఇస్తున్నట్లు ఆమె వెల్లడించారు. దీంతో ఈ వ్యవహారం నెట్టింట భారీ చర్చకు తెరలేపింది.
నెలకు రూ.50వేల జీతం, ఏటా హైక్స్..
ఈ మేరకు యులియా వీడియోలో మాట్లాడుతూ.. డొమెస్టిక్ హెల్పర్ లేదా నానీ ఉద్యోగాన్ని కూడా కార్పొరేట్ ఉద్యోగాల మాదిరిగానే గౌరవంగా చూడాలని చెప్పుకొచ్చారు. వారిని కుటుంబ సభ్యుల్లా చూసుకోవాలని తెలిపారు. తన దగ్గర పనిచేస్తున్న నానీ కేవలం గృహ సేవలు మాత్రమే కాకుండా, పిల్లల అభివృద్ధిలో కూడా భాగస్వామి అవుతుందన్నారు. అందుకే ఆమెకు తగిన జీతం, గౌరవం ఇస్తానని పేర్కొన్నారు.

అంతే కాకుండా ప్రతి ఏడాది ఆమె పనితీరు ఆధారంగా హైక్ ఇస్తానని.. ఆమెకు డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఇప్పించానని వెల్లడించారు. అవసరమైతే ఇతర నైపుణ్యాల కోసం కూడా ట్రైనింగ్ కొరకు పంపిస్తానని వివరించారు. కాగా ఇలా చేయడం వల్ల ఉద్యోగుల్లో నమ్మకం పెరుగుతుందని.. వారు దీర్ఘకాలం పని చేయాలనుకుంటారని కూడా ఆమె అన్నారు. ఇంతవరకు తన దగ్గర ఎవరూ ఉద్యోగం వదిలి వెళ్లనందుకు గర్వంగా ఉందని చెప్పారు. ప్రతి ఉద్యోగికి గౌరవం ఇవ్వడం అత్యంత అవసరమని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆమెను ప్రశంసలతో ముంచెత్తారు. చాలామంది ఆమెను "రియల్ బాస్", "ఇన్‌స్పిరేషన్ టు మిలియన్స్" అంటూ కామెంట్ చేశారు. మన దేశంలో కూడా ఇలాంటి ఆలోచన వస్తే, పనిమనుషుల జీవన ప్రమాణం మెరుగవుతుందని రాసుకొచ్చారు.
అయితే కొంతమంది నెటిజన్లు మాత్రం విమర్శిస్తూ.. ఇంత ఎక్కువ జీతం ఇవ్వడం వల్ల ఇతర పనిమనుషులు కూడా అదే స్థాయి డిమాండ్ చేస్తారని అంటున్నారు. దీంతో మార్కెట్ రేట్లు పెరుగుతాయని అన్నారు.












Click it and Unblock the Notifications