జూనియర్ డాక్టర్ గ్యాంగ్‌రేప్?: పరిస్థితి చేయి దాటింది..
RG Car gang rape: కోల్‌కతలోని ఆర్‌జీ కార్ మెడికల్ కాలేజ్‌లో జూనియర్ డాక్టర్ అత్యాచారం, హత్య ఘటన దుమారం రేపుతోంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ దారుణానికి వ్యతిరేకంగా డాక్టర్లు, మెడికోలు చేపట్టిన నిరసన ప్రదర్శనలు హింసాత్మకంగా మారాయి. మెడికల్ కాలేజీ క్యాంపస్‌లోకి దూసుకెళ్లిన నిరసనకారులు.. అక్కడి ఆస్తులను ధ్వంసం చేశారు.
ఈ నెల 9వ తేదీన ఆర్‌జీ కార్ మెడికల్ కాలేజ్ సెమినార్ హాలులో జూనియర్ డాక్టర్ ఒకరు మృతదేహమై కనిపించారు. శరీరంపై దుస్తులు లేని స్థితిలో ముఖం, చేతిపై గాయాలతో కనిపించారు. ఆమె కళ్లజోడు సైతం పగిలిపోయాయి. ఆ అద్దాలు కళ్లల్లోకి చొచ్చుకుని పోయినట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తోన్నారు.

హత్య చేయడానికి ముందు గుర్తు తెలియని వ్యక్తులు ఆమెపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ విషయాన్ని పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో ధృవీకరించారంటూ జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ ఘటన యావత్ దేశాన్ని కదిలించింది. ఈ కేసును పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం.. సీబీఐకి అప్పగించింది. రంగంలో దిగిన సీబీఐ అధికారులు ఒకరిని అరెస్ట్ చేశారు.
తృణమూల్ కాంగ్రెస్,బీజేపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మమతా బెనర్జీ వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాలంటూ బీజేపీ డిమాండ్ చేస్తోంది. అసలైన దోషిని మమతా ప్రభుత్వం వదిలేస్తోందని బీజేపీ ఆరోపించింది. దోషికి టీఎంసీతో సంబంధాలున్నాయి కాబట్టే వదిలేసి ఎవరినో కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తోందని బీజేపీ మండిపడింది.
ఈ అత్యాచారం, హత్యోదంతానికి నిరసనగా ఆర్జీ కార్ ఆసుపత్రి వద్ద బుధవారం రాత్రి మెడికోలు చేపట్టిన నిరసన కొవ్వొత్తి ప్రదర్శనలు హింసాత్మకంగా మారాయి. అర్ధరాత్రి దాటిన తరువాత నిరసనకారులు ఒక్కసారిగా క్యాంపస్‌లోకి దూసుకెళ్లారు. విధ్వంసానికి దిగారు. ఆస్తులను ధ్వంసం చేశారు. పార్క్ చేసి ఉంచిన వాహనాలను ధ్వంసం చేశారు.
వారిని అడ్డుకోవడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. అడ్డుగా ఉంచిన బ్యారికేడ్లను సైతం దాటుకుని క్యాంపస్‌లోకి ప్రవేశించారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేశారనే వార్త దావానలంలా వ్యాపించడమే దీనికి ప్రధాన కారణమని, తాము ఎవ్వరినీ అరెస్ట్ చేయలేదని కోల్‌కత నగర పోలీస్ కమిషనర్ వినీత్ గోయెల్ తెలిపారు. వదంతులను నమ్మవద్దని కోరారు.












Click it and Unblock the Notifications