సోనియా పుస్తకానికి బదులు బాల్ థాక్రే ఫొటో చించేశారు- శివసేన నిరసన బూమరాంగ్..!
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ రాసుకున్న తన ఆత్మకథ బిలాంగింగ్ తాజాగా అధికారికంగా విడుదలైంది. ఇందులో మహారాష్టీయులకు ఆరాధ్యుడైన వీర్ సావర్కర్ ను కించపరిచేలా వ్యాఖ్యలు ఉన్నాయంటూ శివసేన నేతలు ఇవాళ ఆందోళన చేపట్టారు. తమ పార్టీ కార్యాలయంలోనే సోనియా గాంధీ పుస్తకాన్ని తీసుకొచ్చి చించడం ప్రారంభించారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న శివసేన అధినేత బాల్ థాక్రే ఫొటోను కూడా చించేశారు. దీంతో ఈ వ్యవహారం మహారాష్ట్రలో తీవ్ర వివాదాస్పదమవుతోంది.
శివసేన రెండు వర్గాలుగా విడిపోయిన తర్వాత అధికార కూటమిలో భాగస్వామిగా, డిప్యూటీ సీఎంగా ఉన్న ఏక్ నాథ్ షిండే వర్గం సోనియా గాంధీ ఆత్మకథ బిలాంగింగ్ లో వీర్ సావర్కర్ పై చేసిన వ్యాఖ్యలపై మండిపడుతోంది. ఈ వ్యాఖ్యల్ని తొలగించాలని పుస్తక ప్రచురణకర్త అయిన హార్పర్ కొలిన్స్ కంపెనీని డిమాండ్ చేస్తోంది. అంతటితో ఆగకుండా ఇవాళ సోనియా గాంధీ పుస్తకం కాపీల్ని తీసుకొచ్చి శివసేన నేతలందరూ కలిసి తమ ఆఫీసులోనే చించడం ప్రారంభించారు. మీడియా కెమెరాల్ని చూసిన వారిలో జోష్ మరింత పెరిగింది. ఇదే క్రమంలో శివసేన మహిళా నేత షైనా ఎన్సీ (Shaina NC) అక్కడే ఉన్న బాల్ థాక్రే ఫొటో కూడా చింపేశారు.

దీంతో ఆమె పక్కనే ఉన్న పార్టీ నేతలు సంజయ్ నిరుపమ్, ఇతరులు అలర్ట్ చేశారు. దీంతో నాలిక కరుచుకుంటూ ఆ ఫొటోను పూర్తిగా చించకుండా పక్కనబెట్టేశారు. అయితే ఈ విషయం కాసేపట్లోనే అందరికీ తెలిసిపోవడంతో శివసేన ఆత్మరక్షణలో పడిపోయింది. తమ నేత షైనా ఎన్సీ చర్యను సమర్థించుకోలేక శివసేన ఇబ్బందుల్లో పడింది. షైనా ఎన్సీ మాత్రం తమకు ఆరాధ్యుడైన శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాక్రే ఫొటోను తాను చించలేదంటూ వివరణలు ఇవ్వడం ప్రారంభించారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటానంటూ ఎక్స్ లో హెచ్చరికల్ని పోస్ట్ చేశారు. దీనిపై స్పందించిన పలువురు.. ఆమె బాల్ థాక్రే ఫొటో చింపుతున్న చిత్రాల్ని పోస్ట్ చేస్తున్నారు. మరోవైపు షైనా చర్యపై మహారాష్ట్రలో అన్ని పార్టీలు మండిపడుతున్నాయి. సేన వ్యవస్థాపకుడిని ఆమె కావాలనే అవమానించారంటూ ఉద్ధవ్ శివసేనతో పాటు కాంగ్రెస్ కూడా విమర్శలకు దిగింది.














Click it and Unblock the Notifications
