Chandrayaan-3: ‘శివశక్తి’.. ఆ పేరే ఎందుకంటే?: ప్రధాని మోడీ క్లారిటీ
న్యూఢిల్లీ: చంద్రయాన్-3 చంద్రుడిపై ల్యాండ్ అయిన ప్రదేశానికి శివశక్తి పేరు సూచించడం వెనుక ఉన్న కారణాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వివరించారు. బెంగళూరు నుంచి ఢిల్లీ చేరుకున్న ప్రధాని.. విమానాశ్రయం వెలుపల బీజేపీ నేతలు ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.
చంద్రుడిపై చంద్రయాన్-3 దిగిన ప్రాంతానికి శివశక్తి అని పేరు పెట్టామని ప్రధాని మోడీ తెలిపారు. మనం శివ అనే పదాన్ని శుభంగా భావిస్తాం. దేశంలోని నారీమణుల గురించి మాట్లాడేటప్పుడు శక్తి పదాన్ని వాడుతాం. ఆ పేరు వెనుక ఉద్దేశం ఇదే అని ప్రధాని మోడీ వివరించారు. ప్రపంచ సంక్షేమం, మహిళల శక్తి అని తెలిపారు. అలాగే చంద్రయాన్-2 క్రాష్ ల్యాండ్ అయిన ప్రదేశానికి గుర్తింపునిస్తూ దానిని 'తిరంగా పాయింట్' అని పిలుచుకుందామన్నారు ప్రధాని మోడీ.
కాగా, బెంగళూరులోని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) టెలిమెట్రీ, ట్రాకింగ్, కమాండ్ నెట్‌వర్క్ (ISTRAC)ని సందర్శించిన సందర్భంగా ప్రధాని మోడీ ఈ విషయాన్ని ప్రకటించారు. చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండింగ్ అయినందుకు ఇస్రో బృందాన్ని ఆయన అభినందించారు, ఈ మిషన్ భారతదేశానికి "చారిత్రక క్షణం" అని అన్నారు. చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతమైన క్షణంలో తాను పొందిన ఆనందాన్ని మాటల్లో వర్ణించలేనని చెప్పారు.
తాను బ్రిక్స్ సదస్సు కోసం దక్షిణాఫ్రికా వెళ్లిన సమయంలో చంద్రయాన్-3 విజయంపై ప్రపంచ దేశాల నుంచి ఎన్నో అభినందన సందేశాలు వచ్చాయని ప్రధాని మోడీ తెలిపారు. కాగా, ప్రధాని మోడీ శనివారం ఉదయం ఇస్రో శాస్త్రవేత్తలను కలిసి వారిని అభినందించిన విషయం తెలిసిందే. మరోవైపు, ఆగస్టు 23ను భారత అంతరిక్ష దినోత్సవంగా నిర్వహించుకోవాలని ప్రకటించారు.
ఇది ఇలావుంటే, జీ20 సదస్సు నేపథ్యంలో ఢిల్లీ ప్రజలకు మరింత బాధ్యతలు ఉన్నాయన్నారు. సెప్టెంబర్ 5 నుంచి 15 వరకు భారీ సంఖ్యలో అతిథులు రానున్నారని, దీంతో ట్రాఫిక్ నిబంధనల్లో మార్పులు రానున్నాయని తెలిపారు. దీని వల్ల మీకు అసౌకర్యం కలగవచ్చునని.. ఈ విషయంలో తాను ఢిల్లీ ప్రజలకు ముందుగానే క్షమాపణలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు.

అయితే, ప్రధాని మోడీ మాట్లాడుతున్న సమయంలో ఓ వ్యక్తి అస్వస్థతకు గురయ్యారు. దీన్ని గమనించిన ప్రధాని మోడీ.. తక్షణమే తన వ్యక్తిగత వైద్యులకు సూచన చేశారు. ఆ వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించాలని ఆదేశించారు. దీంతో వారు అతనికి అవసరమైన వైద్యం అందించారు.












Click it and Unblock the Notifications