షాకింగ్: కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్పపై లైంగికదాడి ఫిర్యాదు.. పోక్సో కేసు!!
కర్ణాటక మాజీ సీఎం, బిజెపి సీనియర్ నాయకుడు బిఎస్ యడ్యూరప్పపై ఊహించని కేసు నమోదయింది. ఒక మైనర్ బాలికపై లైంగిక దాడి కేసు యడ్యూరప్పపై నమోదయింది. తన కుమార్తెపై బిఎస్ యడ్యూరప్ప లైంగిక దాడికి పాల్పడ్డాడని, ఓ 17 సంవత్సరాల బాలిక తల్లి పోలీస్ స్టేషన్లో చేసిన ఫిర్యాదు మేరకు ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
బెంగళూరులోని సదాశివనగర్ లో సదరు మహిళ తన కుమార్తెపై లైంగిక దాడి చేశారని కేసు పెట్టడంతో, బాలిక 17 సంవత్సరాల మైనర్ కావడంతో బి ఎస్ యడ్యూరప్ప పై పోక్సో చట్టం కింద సదాశివనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోక్సో చట్టంలోని సెక్షన్ 8 కింద అలాగే ipc 354a కింద యడ్యూరప్పపై పోలీసులు కేసు నమోదు చేశారు.

81 సంవత్సరాల యడ్యూరప్ప దగ్గరకు ఫిబ్రవరి రెండు 2024 న ఒక లైంగిక దాడి కేసుకు సంబంధించి, సహాయం అర్థించడానికి వెళ్లిన సమయంలో, ఆయన తన కుమార్తెపై లైంగిక దాడి చేశారని సదరు మహిళ ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే ఈ లైంగిక దాడి ఫిర్యాదుపై ఇప్పటివరకు కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప స్పందించలేదు.
కాగా పోక్సో చట్టం 2012 ప్రకారం లైంగిక దాడి కేసులో దోషిగా తేలితే కనీసం మూడు సంవత్సరాలు శిక్ష పడుతుంది అయితే పోక్సో చట్టంలోని సెక్షన్ లు, అనుబంధంగా ఉన్న ఐపీసీ సెక్షన్ ల తీవ్రత, నేర నిరూపణ బట్టే శిక్ష తీవ్రత ఉంటుంది. ఇదిలా ఉంటే కర్ణాటక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఇప్పటికి మూడుసార్లు బీఎస్. యడ్యూరప్ప పనిచేశారు. 2021లో ఆయన తన సీఎం పదవికి రాజీనామా చేశారు.












Click it and Unblock the Notifications