అన్నన్నా: నేను అలా అనలేదన్న సిద్దరామయ్య
కర్నాటకలో కుమారస్వామి ప్రభుత్వం ఎక్కువ రోజులు మనుగడలో ఉండదని ఆ రాష్ట్ర మాజీ సీఎం సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యల వీడియో వైరల్‌గా మారడంతో సిద్దూ నాలుక కర్చుకున్నారు. కాంగ్రెస్ జనతాదల్ సెక్యూలర్ బంధం దృఢంగా ఉందని ఐదేళ్ల పాటు ప్రభుత్వంలో ఉంటుందంటూ సవరించుకున్నారు.
బెంగళూరులో కాంగ్రెస్ సమన్వయకర్తల సమావేశంలో సిద్ధరామయ్య తాను చేసిన వ్యాఖ్యలపై గొంతువిప్పారు. తాను చేసిన వ్యాఖ్యల వీడియో వైరల్ కావడంతో సిద్ధరామయ్య మౌనం వీడారు. నేను సంతోషంగా లేనని ఎవరు చెప్పారు... నేను ఆ వ్యాఖ్యలు ఏసందర్భంలో చేశానో మీకెవరికి తెలియదు అంటూ ఊగిపోయారు. అంతేకాదు మామూలుగా మాట్లాడుకునే సమయంలో అన్నీ రికార్డు చేయడం సరైన పద్ధతి కాదు అంటూ సిద్ధరామయ్య చురకలు అంటించాడు. అందులోని వ్యాఖ్యలను ఎలాంటి సందర్భంలో చేశానో తెలియకుండా వీడియో టేపులను విడుదల చేయడం విలువలతో కూడిన పని కాదన్నారు. అయితే ఎవరు రికార్డు చేశారన్నది మాత్రం సిద్దరామయ్య బహిర్గతం చేయలేదు.

విడుదలైన తొలి వీడియోలో కుమారస్వామి కొత్త బడ్జెట్ ప్రవేశపెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ సిద్ధరామయ్య ప్రశ్నించారు. తాను సీఎంగా ఉన్నసమయంలో అంటే ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ సరిపోతుంది కదా అనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేయడం జరిగింది. ఇక తాను చికిత్స పొందేందుకు నేచర్ క్యూర్ హాస్పిటల్‌కు వచ్చిన సమయంలో జేడీఎస్ కాంగ్రెస్‌ల ప్రభుత్వం ఎక్కువ రోజులు నిలవదనే వ్యాఖ్యలు చేసినట్లు ఉన్న వీడియో లీక్ అయ్యింది. దీనిపై కూడా పెద్ద ఎత్తున దుమారం రేగింది.












Click it and Unblock the Notifications