అబ్బురపరిచే పెళ్లి పత్రిక: 3 కిలోల వెండి.. 25 లక్షల ఖర్చు.. ఏడాది కాలం శ్రమ!
Silver Wedding Card: సాధారణంగా పెళ్లి పత్రికలు అంటే కాగితంపై ముద్రించినవి లేదా డిజిటల్ కార్డులు చూస్తుంటాం. కానీ రాజస్థాన్ రాజధాని జైపూర్‌కు చెందిన ఓ తండ్రి తన కూతురు వివాహం కోసం ఎవరూ ఊహించని విధంగా ఓ అద్భుతమైన వెండి పెళ్లి పత్రికను తయారు చేయించారు. దీని తయారీకి వాడిన వెండి , పెట్టిన ఖర్చు చూస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే.
ఏడాది పాటు 128 వెండి ముక్కలతో కళాఖండం
జైపూర్‌కు చెందిన ప్రముఖ నగల వ్యాపారి శివ్ జౌహరీ తన కూతురు శ్రుతి జౌహరీ వివాహాన్ని అందరూ గుర్తుంచుకునేలా చేయాలనుకున్నారు. అందుకోసం సుమారు 3 కిలోల స్వచ్ఛమైన వెండితో ఓ పెట్టె వంటి ఆకారంలో ఉండే ఆహ్వాన పత్రాన్ని రూపొందించారు. దీని ప్రత్యేకతలు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. ఈ ఒక్క కార్డు తయారీకే ఆయన 25 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. దీనిని పూర్తి చేయడానికి కళాకారులకు ఒక్క ఏడాది సమయం పట్టింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ కార్డులో 128 వెండి ముక్కలను వాడారు. ఎక్కడా మేకులు లేదా స్క్రూలు వాడకుండా కేవలం కళాత్మక నైపుణ్యంతో వీటిని అతికించడం విశేషం.

65 మంది దేవతా మూర్తుల ప్రతిమలు
ఈ వెండి కార్డు కేవలం ఆహ్వానం మాత్రమే కాదు.. ఒక ఆధ్యాత్మిక కళాఖండం. కార్డు పైన వినాయకుడు, కుడివైపు పార్వతి దేవి, ఎడమవైపు శివుడు, కింద లక్ష్మీ నారాయణులు కొలువై ఉన్నారు. మొత్తంగా 65 మంది దేవతా మూర్తుల ప్రతిమలను ఇందులో చాలా సూక్ష్మంగా చెక్కారు. శ్రీకృష్ణుడి బాల్య లీలలు, విష్ణుమూర్తి దశావతారాలు, అష్టలక్ష్ములు, తిరుపతి బాలాజీ రూపాలను కూడా ఇందులో పొందుపరిచారు. కార్డు మధ్యలో వధూవరులైన శ్రుతి జౌహరీ, హర్ష్ సోనీ పేర్లు ఉన్నాయి. వారి చుట్టూ ఏనుగులు పూల వర్షం కురిపిస్తున్నట్లుగా చెక్కిన దృశ్యం ఐశ్వర్యానికి ప్రతీకగా నిలుస్తోంది.
కూతురిపై తండ్రికున్న మమకారం
ఈ వినూత్న ప్రయత్నం గురించి శివ్ జౌహరీ మాట్లాడుతూ.. "ఇది కేవలం ఒక పెళ్లి పత్రిక మాత్రమే కాదు, ఒక తండ్రిగా నా కుమార్తెకు ఇచ్చే భావోద్వేగపూరిత కానుక. ఆమె వివాహానికి దేవతలందరి ఆశీస్సులు ఉండాలని ఇలా తయారు చేయించాను. ఇది తన జీవితాంతం ఒక జ్ఞాపకంలా నిలిచిపోతుంది" అని పేర్కొన్నారు. ఈ అరుదైన కార్డును ఆయన తన కాబోయే వియ్యంకుడికి (అల్లుడి తండ్రికి) అందజేశారు. ప్రస్తుతం ఈ 'సిల్వర్ వెడ్డింగ్ కార్డ్' సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జైపూర్ కళా వైభవానికి, ఒక తండ్రి ప్రేమకు ఇది నిదర్శనమని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.












Click it and Unblock the Notifications