సోషల్ మీడియాలోకి సోనియా గాంధీ గ్రాండ్ ఎంట్రీ.. తొలి పోస్ట్ వైరల్!
భారత రాజకీయాల్లో అత్యంత సుదీర్ఘకాలం కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పనిచేసిన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ తాజాగా డిజిటల్ దునియాలోకి అడుగుపెట్టారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె అఫిషియల్ అకౌంట్ ప్రారంభించారు. ఖాతా తెరిచిన వెంటనే ఆమె పంచుకున్న తొలి వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. సాధారణంగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎంతో గోప్యంగా ఉండే సోనియా గాంధీ, తొలిసారిగా నెటిజన్లతో నేరుగా ముచ్చటించేందుకు ఈ వేదికను ఎంచుకోవడం రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.
'బిలాంగింగ్' పేరుతో స్వీయ చరిత్ర
తన తొలి ఇన్‌స్టాగ్రామ్ పోస్టు ద్వారా సోనియా గాంధీ తన స్వీయ ఆత్మకథ మొదటి లుక్‌ను ఆవిష్కరించారు. 'బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్' (Belonging: A Journey of Love) అనే ఆసక్తికర శీర్షికతో ఈ పుస్తకం రూపుదిద్దుకుంది. ఈ సందర్భంగా ఆమె స్పందిస్తూ.. తన జీవితంలో అనుభవించిన ప్రేమ, నిర్వహించిన బాధ్యతలు, చవిచూసిన తీరని లోటుపాట్లు, ఒక సరికొత్త దేశాన్ని తన స్వగృహంగా మలచుకున్న క్రమాన్ని ఈ పుస్తకంలో పొందుపరిచినట్లు వెల్లడించారు. ఈ ప్రత్యేకమైన అనుభవాలను ప్రపంచంతో పంచుకోవడం తనకు ఎంతో సంతోషాన్నిస్తోందని ఆమె పేర్కొన్నారు.

కేంబ్రిడ్జ్ ప్రేమ నుంచి భారత్ గడ్డ వరకు..
ప్రముఖ అంతర్జాతీయ ప్రచురణ సంస్థ 'ఆల్ఫ్రెడ్ ఎ నాఫ్' ద్వారా ప్రచురితమవుతున్న ఈ పుస్తకం నవంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రస్తుతం 79 ఏళ్ల వయస్సున్న సోనియా గాంధీ, ఈ ఆత్మకథలో తన బాల్య జ్ఞాపకాలను ప్రత్యేకంగా గుర్తుచేసుకున్నారు. రెండవ ప్రపంచ యుద్ధం తదనంతర కాలంలో ఇటలీలో గడిపిన రోజులు, 1965లో 19 ఏళ్ల వయసులో ఇంగ్లాండ్‌లోని కేంబ్రిడ్జ్‌లో చదువుకుంటున్న సమయంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీతో ఏర్పడిన పరిచయం, ప్రేమ, ఆ తర్వాత 1968లో వివాహబంధంతో భారత్‌కు రావడం వరకు అనేక మధుర ఘట్టాలను ఇందులో ప్రస్తావించారు. అంతేకాకుండా, అత్తగారు ఇందిరా గాంధీ, భర్త రాజీవ్ గాంధీల దారుణ హత్యలు తన జీవితాన్ని ఎలా మలుపు తిప్పాయో ఆవేదనతో వివరించారు.
తల్లి ప్రయాణంపై రాహుల్ గాంధీ భావోద్వేగం
సోనియా గాంధీ తన ఆత్మకథను తీసుకువస్తుండటం పట్ల లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఎప్పుడూ తన వ్యక్తిగత విషయాలను బయటకు రానివ్వని తమ తల్లి, కోట్లాది మంది అభిమానుల కోసం తన హృదయపూర్వక కథను పంచుకోవడానికి ముందుకు రావడం గర్వకారణమని కొనియాడారు. రాజీవ్ గాంధీ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని రాహుల్ స్పందిస్తూ.. ఆకాశం నుంచి నాన్న కూడా అమ్మ ప్రయాణాన్ని చూసి ఎంతో గర్వంతో చిరునవ్వు చిందిస్తుంటారని వ్యాఖ్యానించారు.














Click it and Unblock the Notifications
