ప్రతిపక్ష నేతల ఐక్యత: రామ్లీలా మైదాన్.. ఇసుక వేస్తే రాలనంత జనం
ఢిల్లీలోని చారిత్రాత్మక రామ్లీలా మైదాన్ లో ప్రతిపక్షాల ఇండియా కూటమి నిర్వహించ తలపెట్టిన ఓట్ బచావో, దేశ్ బచావో మహా ర్యాలీ దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కేంద్రంలో అధికారంలో ఎన్డీఏ ప్రభుత్వ వైఖరికి నిరసనగా, ప్రజాస్వామ్య వ్యవస్థలు, ఓటు హక్కును పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ విపక్ష నేతలు ఒకే వేదికపైకి వచ్చారు. వారంతా కూడా మింటో హౌస్ నుంచి రామ్ లీలా మైదాన్ కు రెండు ఓపెన్ టాప్ బస్సుల్లో బయలుదేరి వెళ్లారు.
లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు ప్రతిపక్షాలకు చెందిన పలువురు కేంద్ర, ప్రాంతీయ నేతలు ఈ బస్సులో ఒకేచోట కనిపించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రియాంక గాంధీ వాద్రా, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే సహా పలువురు కీలక ప్రతిపక్ష నాయకులు ఒకే వేదికపై కొలువుదీరారు.

దేశంలోని వేర్వేరు రాష్ట్రాల నుంచి వచ్చిన విపక్ష శ్రేణులు ఒకే తాటిపై నిలబడి తమ బలమైన ఐక్యతను చాటుకున్నాయి. మింటో రోడ్ వద్ద ఆరంభమైనఈ ర్యాలీలో దాదాపు అన్ని విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు, కేంద్ర మాజీమంత్రులు తరలివచ్చారు. ఆయా పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. నిరసన ర్యాలీ చేపట్టారు. వారి రాకతో ఢిల్లీ వీధులు క్రిక్కిరిసిపోయాయి. అటు రామ్ లీలా మైదన్ లో కూడా ఇసుకవేస్తే రాలనంత మంది జనం కనిపించారు.
ర్యాలీ సందర్భంగా తనను కలిసిన విలేకరులతో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ మాట్లాడారు. కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో అరాచకం సృష్టించడం తమ ఉద్దేశం కాదని, రాజ్యాంగం పౌరులకు ప్రసాదించిన ప్రాథమిక హక్కులను కాపాడడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. పౌరుల ఓటు హక్కును అపహరించే యత్నాలను అడ్డుకుంటామని, రాజ్యాంగ సూత్రాలపై దాడులు ఆగినప్పుడే దేశంలో ప్రజాస్వామ్యం సురక్షితంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
రామ్లీలా మైదానానికి తరలివచ్చిన ప్రజాసందోహం విపక్షాల వైపే ఉందనడానికి బలమైన సంకేతమని థరూర్ ధీమా వ్యక్తం చేశారు. ఎలక్షన్ కమిషన్ తీరుపై కూడా విపక్ష నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాతీర్పును పక్కదారి పట్టించడంలో అధికార వర్గాలకు సహకరించారని ఆరోపించారు.
ఆర్ఎస్పీ ఎంపీ ఎన్ కె ప్రేమచంద్రన్ మాట్లాడుతూ గత 12 ఏళ్ల ఎన్డీఏ పాలన పట్ల ప్రజల్లో పెల్లుబుకుతున్న తీవ్ర అసంతృప్తికి ఈ ర్యాలీ నిదర్శనమని, రాబోయే రోజుల్లో దేశ రాజకీయాల్లో ఈ ప్రజా ఉద్యమం పెద్ద మార్పునకు దారితీస్తుందని స్పష్టం చేశారు. ఓటర్ల హక్కులను కాపాడడం, పారదర్శక ఎన్నికల వ్యవస్థను డిమాండ్ చేయడమే ప్రధాన ఎజెండాగా సాగిన ఈ ఓట్ బచావో, దేశ్ బచావో ర్యాలీ రాబోయే రాజకీయ పోరాటాలకు స్పష్టమైన దిశానిర్దేశం చేసింది.













Click it and Unblock the Notifications
