న్యాయ వ్యవస్థను ఎవరూ బెదిరించలేరు- రాహుల్ గాంధీపై సీజేఐ సూర్యకాంత్ ఫైర్
దేశ రాజధానిలో నిరసనలపై విధించిన ఆంక్షలపై సుప్రీంకోర్టులో విచారణ చేపట్టింది. కాంగ్రెస్ అధినేత మల్లికార్జున ఖర్గే, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సహా 13 మంది ప్రతిపక్ష నాయకులు దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ సూర్యకాంత్ ఆధ్వర్యంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఈ నెల 12 నాటి ఆందోళనలో రాహుల్ గాంధీ ప్రవర్తన, ఆయన వైఖరిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. దీనిపై స్పష్టమైన వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
ఎస్ఐఆర్ విధానం, ఫామ్ 6లో తీసుకొచ్చిన మార్పుల రాజ్యాంగ బద్ధతపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు సైతం పట్టుబట్టాయి. ఓటర్ల జాబితా సవరణలో పారదర్శకత కొరవడిందని, అర్హులైన పౌరుల ఓటు హక్కుకు భంగం కలిగించేలా ఈ చర్యలు ఉన్నాయనేది ప్రతిపక్షాల వాదన. ఈ వ్యవహారంలో ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఆయా పిటీషన్లన్నింటిపైనా సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాలా బాగ్చీతో కూడిన ధర్మాసనం సమక్షానికి వచ్చాయి. ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన అన్ని పిటిషన్లను ఒకే కేటగిరీ కింద కలిపి విచారిస్తామని, ధర్నా చౌక్, నిరసన ప్రదర్శనల ఆంక్షల అంశాన్ని ప్రత్యేక విచారణగా చేపడతామని తెలిపింది. పెండింగ్లో ఉన్న ఇతర కేసులతో కలిపి విచారిస్తామని ధర్మాసనం ఈ సందర్భంగా స్పష్టం చేసింది.
ఇండియా బ్లాక్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్, కేంద్ర ప్రభుత్వం నుంచి సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తమ వాదనలు వినిపించారు. వాదనల సందర్భంగా విపక్షాలు లేవనెత్తిన అభ్యంతరాలపై వివరణ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ న్యాయస్థానం ఆదేశించింది. విచారణ సందర్భంగా సీజేఐ బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది.
వాదనల సందర్భంగా బెంచ్.. రాహుల్ గాంధీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల 12న నిర్వహించిన సుప్రీంకోర్ట్ మార్చ్ లో ఆయన వైఖరి, వ్యాఖ్యల పట్ల సీజేఐ ఘాటుగా స్పందించారు. రాహుల్ గాంధీ ప్రవర్తన బెదిరింపు ధోరణిలో ఉందని వ్యాఖ్యానించారు. న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరు.. అని సీజేఐ సూర్యకాంత్ స్పష్టం చేశారు. తన ప్రవర్తనపై రాహుల్ గాంధీ సంతృప్తికర వివరణ ఇవ్వాలని ఆదేశించారు.
కేంద్రానికి, ఈసీకి నోటీసులను జారీ చేసినంత మాత్రాన తాము ఎస్ఐఆర్ గానీ, జ్ఞానేష్ కుమార్ వైఖరిని గానీ తప్పు పట్టినట్టు కాదని సీజేఐ సూర్యకాంత్ తేల్చి చెప్పారు. అలా చేయడానికి కంటే ముందు.. ప్రతివాదుల వాదనలను వినాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. అలాగే.. తదుపరి విచారణ తేదీ నాటికి పిటిషనర్లలో ఒకరి (రాహుల్ గాంధీ) ప్రవర్తన గురించి వివరణ తీసుకోదలిచామని కపిల్ సిబల్తో సీజేఐ అన్నారు.













Click it and Unblock the Notifications
