'త్రిష విజయ్' పేరుతో పుస్తకాల కలకలం! బయటపడిన వింత కుంభకోణం!!
తమిళనాడు ప్రభుత్వ లైబ్రరీలకు వేలాది ఏఐ ఆధారిత పుస్తకాలను కొనుగోలు చేయడం వెనుక జరిగిన భారీ కుంభకోణం తీవ్ర దుమారం రేపుతోంది. 'త్రిష విజయ్', 'విజయ్ త్రిష', 'సంగీత విజయ్' వంటి నకిలీ రచయితల పేర్లతో తయారు చేసిన పుస్తకాలు ఎలాంటి పరిశీలన లేకుండానే ప్రభుత్వ కమిటీల ఆమోదం పొంది గ్రంథాలయాల విభాగానికి చేరడంపై ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. కొత్తగా ప్రారంభించిన కోయంబత్తూరులోని 'పెరియార్ అరివులగం'(పెరియార్ జ్ఞాన గ్రంథాలయం)లో ఈ అక్రమాలు వెలుగులోకి రావడంతో దాదాపు 1,800కు పైగా నకిలీ పుస్తకాలను అధికారులు అత్యవసరంగా షెల్ఫ్‌ల నుంచి తొలగించారు.
నకిలీ రచయితల పేరుతో 'త్రిష విజయ్' విడ్డూరం!
భారీ స్థాయిలో నిర్మించిన ఈ లైబ్రరీని ప్రారంభించిన సమయంలో ర్యాకులలో అమర్చిన పుస్తకాలపై ప్రముఖ నటులు, రాజకీయ నాయకుల పేర్లను కలిపి రూపొందించిన 'త్రిష విజయ్', 'జ్యోతి శరవణన్' వంటి నకిలీ రచయితల పేర్లు కనిపించాయి. వివిధ స్థాయిలలో లైబ్రరీ పుస్తకాల ఎంపిక కమిటీలు, శాఖాపరమైన ఇన్‌స్పెక్టర్లు ఉన్నప్పటికీ.. ఈ బూటకపు పుస్తకాలను ఏ ఒక్క అధికారి కనిపెట్టలేకపోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. వైజ్ఞానిక విచారణను, హేతువాదాన్ని ప్రోత్సహించడానికి పెరియార్ పేరిట ఏర్పాటు చేసిన సంస్థలోనే ఇలాంటి విడ్డూరం జరగడంపై పాఠకులు, మేధావులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

ప్రముఖ తమిళ రచయిత, ఆచార్యులు పెరుమాళ్ మురుగన్ ఈ లైబ్రరీని సందర్శించి పుస్తకాలను పరిశీలించిన తర్వాత ఈ మహా కుంభకోణం బయటపడింది. సంగం సాహిత్యంలోని 'నాళడియార్' అనే 400 పద్యాల జైనమునుల కవితా సంకలనాన్ని ఓ వ్యక్తిగత 'కవి, తత్వవేత్త' అని తప్పుగా చిత్రీకరించడం, 1947లో తమిళనాడు ముఖ్యమంత్రిగా 'ముత్తువేలు సుబ్బయ్య అయ్యర్' అనే లేని వ్యక్తిని సృష్టించడం వంటి అనేక చారిత్రక తప్పులు ఆ పుస్తకాల్లో ఉన్నట్లు ఆయన గుర్తించారు. పైగా రూ.250 నుంచి రూ.350 విలువ చేసే పుస్తకాలకు ప్రభుత్వ ఖజానా నుంచి రూ.1,200 నుంచి రూ.1,445 వరకు అధిక ధరలు వసూలు చేసినట్లు ఆధారాలు లభించాయి.
మంత్రుల రీల్స్ హడావుడిపై ప్రజల మండిపాటు
లైబ్రరీ ప్రారంభోత్సవ సమయంలో పర్యటించిన పలువురు మంత్రులు, ఉన్నతాధికారుల తీరుపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల దృష్టి అంతా లైబ్రరీ పరిశీలన కంటే సోషల్ మీడియా రీల్స్, వీడియో బైట్లు తీసుకోవడంపైనే ఉందని స్థానిక పౌర సమాజ వర్గాలు ఆరోపించాయి. పుస్తకాల జాబితాను కానీ, వాటి నాణ్యతను కానీ సరిచూడకుండా కేవలం పబ్లిసిటీ కోసం పర్యటనలు చేయడంతోనే ఈ ఏఐ పుస్తకాలు వెలుగులోకి వచ్చేవరకు అధికారుల కంట పడలేదని విమర్శలు వస్తున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఆడిట్
ఈ వ్యవహారంలో ప్రభుత్వం తీవ్ర ఇరకాటంలో పడటంతో పాఠశాల విద్యారంగం ఈ టెండర్ల ప్రక్రియపై, నిధుల మళ్లింపుపై లాంచనంగా అవినీతి నిరోధక విభాగానికి ఫిర్యాదు చేసింది. 2025 చివరి నుంచి తమిళనాడు వ్యాప్తంగా బహిరంగ గ్రంథాలయాలకు కొనుగోలు చేసిన దాదాపు 4,80,000 పుస్తకాలను పరిశీలించడానికి ప్రత్యేక ఫోరెన్సిక్ ఆడిట్ బృందాన్ని ఏర్పాటు చేశారు. ప్రధానంగా అగల్ విలక్కు పతిప్పగం, ఫీనిక్స్ పతిప్పగం వంటి ప్రచురణ సంస్థల నుంచి ఈ పుస్తకాలు కొనుగోలు చేసినట్లు గుర్తింపు వాటిపై చర్యలకు ఉపక్రమించారు. ఈ టెండర్లు గత ప్రభుత్వం ఆమోదించిన కమిటీ ద్వారా వచ్చాయా లేక ప్రస్తుత మంత్రుల పర్యవేక్షణలోనే ఆమోదం పొంది బిల్లులు చెల్లించబడ్డాయా అనే అంశంపై అధికార టీవీకే, ప్రతిపక్ష డీఎంకే పార్టీల మధ్య తీవ్రస్థాయిలో రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు సాగుతున్నాయి. పస్తుతం ఈ వివాదాస్పద పుస్తకాలను సీల్ చేసి పక్కన పెట్టినప్పటికీ.. బాధ్యులైన ప్రచురణకర్తలతో పాటు పరిపాలనాపరమైన నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.














Click it and Unblock the Notifications
