రాజకీయాల్లోకి ప్రవేశిస్తోన్న స్టార్ హీరో?
దళపతి విజయ్ చివరిగా వారిసు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తెలుగులో పెద్దగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ తమిళంలో సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. ప్రస్తుతం లోకేష్ కనకరాజు దర్శకత్వంలో లియో సినిమా చేస్తున్నాడు. ఇందులో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. సంజయ్ దత్ కీలక పాత్రను పోషిస్తున్నారు. భారీ బడ్జెట్ తో, భారీ తారాగణంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాను అక్టోబరు 19న విడుదల చేయడానికి నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. రూ.250 నుంచి రూ.350 కోట్ల బడ్జెట్ తో సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ దీన్ని తెరకెక్కిస్తోంది.
వెంకట్ ప్రభు దర్శకత్వంలో చివరి సినిమా?: లియో సినిమా తర్వాత వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి విజయ్ అంగీకారం తెలిపారు. దాదాపుగా విజయ్ సినీ కెరీర్ లో ఇదే చివరి సినిమా అవుతోందనే వార్త తమిళ చిత్ర పరిశ్రమలో చక్కర్లు కొడుతోంది. తమిళనాడు రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని విజయ్ ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కొన్నాళ్లుగా రాజకీయ ప్రవేశాన్ని వాయిదా వేస్తూ వచ్చారు. విజయ్ తండ్రి ఒక రాజకీయ పార్టీని స్థాపించడంతోపాటు కొన్ని ఎన్నికల్లో కూడా పోటీచేశారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పోటీకి దిగే అవకాశాలున్నాయంటూ వార్తలు వస్తున్నాయి.

ఓటు అమ్ముకోవద్దు: రీసెంట్ గా ఒక కన్వెన్షన్ సెంటర్లో విద్యార్థులతో సమావేశమైన విజయ్ ప్రస్తుత రాజకీయాలపై సెటైర్ వేశారు. కాబోయే ఓటర్లు మీరేనని.. మంచి లీడర్లను రాబోయే కాలంలో ఎన్నుకోబోతున్నారని చెప్పారు. డబ్బు తీసుకుని ఓటు వేయడం అంటే మన కన్ను మనమే గుచ్చుకోవడంలాంటిదంటూ కొన్ని ఉదాహరణలు కూడా చెప్పారు. రాజకీయ నేతలు ఎన్నికల సమయంలో ఒక్కో ఓటుకు రూ.1000 చొప్పున రూ.15 కోట్లు పంచిపెడుతున్నారని, అంటే దానికి ముందు, దాని తర్వాత ఎంత సంపాదించాడు? ఎంత సంపాదించబోతున్నాడో ఊహించుకోమన్నారు. వచ్చే ఎన్నికల్లో డబ్బులు తీసుకొని ఓటు వేయకూడదని.. మీరు ఆపని చేయడమే కాకుండా మీ తల్లిదండ్రులకు కూడా చెప్పాలని సూచించారు.

అవార్డులు అందజేసిన విజయ్: పీపుల్స్ మూమెంట్ అనే సంస్థ ద్వారా 10 12వ తరగతిలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు తలపతి విజయ్ చేతుల మీదుగా అవార్డులు అందజేశారు. నిజంగానే వెంకట్ ప్రభు సినిమా తర్వాత తలపతి సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి వస్తారా? లేదా? అనే విషయంపై తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications