ఉగ్రఘాతుకం: బీడీసీపై కాల్పులు, ఇద్దరు మృతి.. మరొకరికి గాయాలు
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. సోపోర్ జిల్లాలో గల మున్సిపల్ కార్యాలయంలో జరుగుతున్న ప్రజాప్రతినిధుల సమావేశమే లక్ష్యంగా కాల్పులతో విరుచుకుపడ్డారు. కాల్పుల్లో గన్‌మ్యాన్ షఫ్కత్ అహ్మద్, కౌన్సిలర్ రియాజ్ అహ్మద్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో కౌన్సిలర్ షంషుద్దీన్ పీర్ గాయపడటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాల్పుల నుంచి బీడీసీ చైర్ పర్సన్ ఫరీదా ఖాన్ తప్పించుకున్నారని పోలీసులు తెలిపారు.

కాల్పుల నేపథ్యంలో జమ్ముకశ్మీర్ పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. సోపోర్‌లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. కాల్పులు జరిపి పారిపోయిన ఉగ్రవాదుల కోసం ఘటనా ప్రాంతంలో, దాని పరిసరాల్లో ముమ్మరంగా గాలిస్తున్నారు. కాల్పుల ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని కశ్మీర్ ఐజీ విజయ్‌కుమార్ తెలిపారు.