టఫ్ ఫైట్.. టైట్ సెక్యూరిటీ
బీహార్ శాసనసభ ఎన్నికల చివరిదైన రెండో విడత పోలింగ్ కు రంగం సిద్ధమైంది. 20 జిల్లాల్లో 122 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఉదయం సరిగ్గా 7 గంటలకు పోలింగ్ ఆరంభం కానుంది. నేపాల్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న సీమాంచల్, తిర్హుట్, మగధ్, షాహాబాద్, కోసి, మిథిలాంచల్ రీజియన్లలోని నియోజకవర్గాల్లో ఈ ఎన్నికలు జరుగనున్నాయి.
తూర్పు, పశ్చిమ చంపారన్, మధుబని, సీతామర్హి, షియోహర్, సుపాల్, అరారియా, కిషన్‌గంజ్, పూర్ణియా, కతిహార్ జిల్లాలతో పాటు భాగల్ పూర్, బాంకా జిల్లాల్లో పోలింగ్ ఆరంభం కానుంది. గయా, ఔరంగాబాద్, జెహానాబాద్, అర్వాల్, జముయి, నవాడ, రోహ్‌తాస్, కైమూర్ వంటి పలు జిల్లాలు పోలింగ్ కు సర్వం సిద్ధం అయ్యాయి. పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. గడువు దాటిన తర్వాత కూడా క్యూలైన్ లో ఉన్న వారికి ఓటు వేయడానికి అవకాశం కల్పిస్తారు.

ఢిల్లీలో చోటు చేసుకున్న భారీ పేలుడు నేపథ్యంలో ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. తొలి విడత కంటే కూడా ఈ దఫా పోలీసులు, పారామిలటరీ బలగాల సెక్యూరిటీ అధికంగా కనిపిస్తోంది. సమస్యాత్మక, సున్నిత ప్రాంతాల్లో అదనపు పోలీస్ బలగాలను మోహరింపజేశారు. ఈ కారణాల వల్లే చైన్‌పూర్, గోవింద్‌పూర్, రాజౌలి, జముయి, సికంద్ర, చకై, ఝాఝా సహా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకే పోలింగ్ ముగుస్తుంది.
గయా, ఔరంగాబాద్, బాంకా, రోహ్‌తాస్ జిల్లాలలోని కొన్ని ప్రాంతాల్లో ఉన్న 1202 పోలింగ్ బూత్‌లలో కూడా సాయంత్రం 5 గంటలకే పోలింగ్ ముగుస్తుంది. సుమారు 3 కోట్ల 70 లక్షల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 136 మంది మహిళలతో సహా మొత్తం 1,302 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. చాలా నియోజకవర్గాల్లో ఎన్డీఏ- మహాకూటమి అభ్యర్థుల మధ్య టఫ్ ఫైట్ నెలకొనివుంది.
ఎన్డీఏ నుండి బీజేపీ- 53, జనతాదళ్ (యునైటెడ్) నుంచి 44 మంది అభ్యర్థులు మలి విడత ఎన్నికల బరిలోకి నిలిచారు. లోక్ జనశక్తి (ఆర్)- 15, హిందుస్తానీ అవామ్ మోర్చా- 6, రాష్ట్రీయ లోక్ మోర్చా- 4 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఈ మూడు పార్టీలు కూడా ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యమైనవే.
మహాకూటమి నుండి ఆర్జేడీ- 71, కాంగ్రెస్- 37 మందిని బరిలోకి దింపింది. ముఖేష్ సహాని నేతృత్వంలోని వికాస్ షీల్ ఇన్సాన్ పార్టీ- 8 స్థానాల్లో పోటీ చేస్తుండగా, సీపీఐ-ఎంఎల్- 6, సీపీఐ- 4, సీపీఎం ఒక స్థానంలో పోటీ పడుతున్నాయి.












Click it and Unblock the Notifications