టిక్ టాక్ వచ్చిందని సంబర పడమాకండి
TikTok: పొరుగుదేశం చైనా- భారత్ మధ్య ఇప్పుడిప్పుడే సంబంధాలు మెరుగుపడుతున్నాయి. ఇటీవలే విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్, జాతీయ భద్రత సలహాదారు అజిత్ ధోవల్.. బీజింగ్ లో పర్యటించి వచ్చారు. ఆ దేశ విదేశాంగ మంత్రి వాంగ్ యీ కూడా భారత్ లో అడుగు పెట్టారు. త్వరలో ప్రధాని మోదీ కూడా చైనా పర్యటనకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.
ఈ పరిస్థితుల మధ్య.. చైనాకు చెందిన వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ టిక్‌టాక్, ఇ- కామర్స్ సంస్థలు అలీ ఎక్స్‌ప్రెస్, షీన్‌పై కేంద్ర ప్రభుత్వం నిషేధాన్ని ఎత్తివేశారనే వార్తలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియా సహా కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ దీనికి సంబంధించిన కథనాలు ప్రచురితం అయ్యాయి.

అయిదు సంవత్సరాల నిషేధం తర్వాత ఇవి తిరిగి వచ్చాయంటూ వార్తలు విస్తృతంగా ప్రచారం అయ్యాయి. టిక్‌టాక్ వెబ్‌సైట్ హోమ్ పేజీని యాక్సెస్ చేయగలిగినప్పటికీ- ఆ తర్వాత ఎటువంటి స్పందన రావట్లేదని కొంతమంది యూజర్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
టిక్‌టాక్ వెబ్‌సైట్ హోమ్‌పేజీకి సంబంధించిన కొన్ని స్క్రీన్ షాట్లను షేర్ చేశారు. అలాగే- అలీ ఎక్స్‌ప్రెస్, షీన్‌లో షాపింగ్ చేయడం సాధ్యం కావట్లేదనీ తెలిపారు. మరికొందరు టిక్ టాక్ యాప్ లను డౌన్ లోడ్ చేసుకోవడానికీ ప్రయత్నించామని, అవి అందుబాటులో లేవని పేర్కొన్నారు.
దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ వార్తలను తోసిపుచ్చింది. ఇలాంటి ప్రచార/మీడియాలో వస్తోన్న కథనాలు అవాస్తవం అని తెలిపింది. ఇందులో ఎటువంటి నిజం లేదని, వాటిని విశ్వసించవద్దని సూచించింది. వాటిపై నిషేధాన్ని ఎత్తివేసే పరిస్థితి వస్తే.. అధికారికంగా ప్రకటిస్తామని పేర్కొంది.
టిక్‌టాక్, అలీ ఎక్స్‌ప్రెస్, షీన్‌కు భారత్ మంచిప్రజాదరణ ఉండేది. 2020 జూన్ 29వ తేదీన టిక్‌టాక్‌తో సహా 58 చైనా యాప్‌లను ఆకస్మికంగా నిషేధించింది కేంద్ర ప్రభుత్వం. దీనికి- డేటా సెక్యూరిటీ చోరీకి గురి అవుతుందనే విషయాన్ని అప్పట్లో కారణంగా వివరించింది.
అదే నెల 15వ తేదీన లడఖ్ సమీపంలో వాస్తవాధీన రేఖ వద్ద గల గాల్వన్ వ్యాలీ వద్ద ఇరు దేశాల సైనికుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలో 20 మంది భారత సైనికులు అమరులు అయ్యారు. ఇది కూడా చైనా యాప్ లపై నిషేధానికి ప్రధాన కారణమైంది. అప్పటి నుంచీ టిక్ టాక్ చైనా యాప్ ల సేవలు స్తంభించాయి.
ప్రస్తుతం రెండు దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొంటోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఏడాది ఫిబ్రవరిలో కొన్ని చైనా యాప్‌లు తిరిగి ప్లే స్టోర్‌లోకి వచ్చాయి. ఎక్స్‌జెండర్, టాన్‌టాన్ వంటి పలు యాప్‌లు తిరిగి డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులోకి వచ్చాయి. దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన టిక్‌టాక్ పై మాత్రం నిషేధం ఇంకా కొనసాగిస్తోంది కేంద్రం.












Click it and Unblock the Notifications