ఘోర ప్రమాదం.. విద్యుత్ షాక్‌తో 8 మంది రోడ్డు నిర్మాణ కూలీలు మృతి
రాజస్థాన్‌లో ఒక విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. ఝుంఝును జిల్లాలోని ఛాపోలి గ్రామంలో రోడ్డు నిర్మాణ పనులు జరుగుతుండగా ఎనిమిది మంది కూలీలు విద్యుత్ షాక్‌తో ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన సోమవారం ఉదయం జరిగింది.
ఉదయ్పూర్వాటి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఛాపోలి గ్రామంలో కదమ్ కుండ్ వైపు వెళ్లే రోడ్డు నిర్మాణం జరుగుతోంది. ఈ పనుల్లో గ్రావెల్ కలిపే మెషిన్‌ను ఉపయోగిస్తున్నారు. అకస్మాత్తుగా ఆ మెషిన్ పైనుంచి వెళ్తున్న 11 వేల వోల్టుల హైటెన్షన్ విద్యుత్ తీగకు తగిలింది. అప్పుడు మెషిన్ ద్వారా కరెంట్ ప్రవహించి అక్కడ పని చేస్తున్న కూలీలు షాక్‌కు గురయ్యారు.పోలీసుల ప్రకారం ఐదుగురు కూలీలు స్పాట్లోనే మరణించగా, మరో ముగ్గురు ఆసుపత్రికి తరలించిన తర్వాత కన్నుమూశారు.

ముగ్గురు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు. స్థానికులు సమాచారం అందగానే సంఘటనా స్థలానికి చేరుకుని రక్షణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అంబులెన్సుల ద్వారా స్థానికులు గాయపడినవారిని ఆసుపత్రికి తరలించారు.ఈ ప్రమాదం తర్వాత గ్రామస్తులు ఆందోళనకు దిగారు. సురక్షా చర్యలు సరిగా పాటించకపోవడంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
జిల్లా అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. గ్రామస్థులతో మాట్లాడుతున్నారు. పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం పంపించారు.రోడ్డు నిర్మాణాల్లో హైటెన్షన్ వైర్లు ఉన్న ప్రాంతాల్లో మెషిన్లు ఉపయోగించేటప్పుడు అధిక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఈ ఘటనతో స్పష్టం అవుతుంది.
కూలీల రక్షణ కోసం ప్రభుత్వాలు, కాంట్రాక్టర్లు సరైన మార్గదర్శకాలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. బాధిత కుటుంబాలకు పరిహారం అందించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషాదంతో గ్రామంలో తీవ్ర దుఃఖ వాతావరణం నెలకొంది. మృతుల కుటుంబాల రోదనలతో అ ప్రాంతం మారు మ్రోగిపోతోంది. సామాన్య రోడ్డు పనులు చేసే కూలీల కుటుంబాల్లో ఈ ఘటన తీరని పెను విషాదాన్ని నింపింది. వారి కుటుంబాలను ఒక్కసారే తలక్రిందులు చేసింది.












Click it and Unblock the Notifications
