రాహుల్ గాంధీ బంగళా నుంచి సామాగ్రి షిఫ్ట్.. తాళం: తెగిన రెండు దశాబ్దాల అనుబంధం
న్యూఢిల్లీ: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత, కేరళలోని వాయనాడ్ లోక్‌సభ సభ్యుడు రాహుల్ గాంధీ.. తన అధికారిక బంగళాను ఖాళీ చేశారు. దేశ రాజధానిలోని నంబర్ 12, తుగ్లక్ లేన్‌లో గల నివాసం నంచి సామాగ్రిని తరలించారు. ఈ పనులు కొద్దిసేపటి కిందటే మొదలయ్యాయి. ఆ బంగళాలో ఉన్న సామాన్లను ట్రక్కుల్లో షిఫ్ట్ చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఇంటిపేరుతో విమర్శించిన నేపథ్యంలో రాహుల్ గాంధీకి గుజరాత్‌లోని సూరత్ న్యాయస్థానం రెండు సంవత్సరాల కారాగార శిక్షను విధించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయనను సూరత్ న్యాయస్థానం దోషిగా తేల్చింది. జైలు శిక్ష పడిన నేపథ్యంలో లోక్‌సభ సెక్రెటేరియట్ ఆయనపై అనర్హత వేటు వేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 102 (1) (ఈ), ప్రజా ప్రతినిధుల చట్టం 1951లోని సెక్షన్ 8 ఆధారంగా వేటు వేసినట్లు వివరించింది.

లోక్‌సభ సభ్యుడిగా రాహుల్ గాంధీకి కేటాయించిన అధికారిక నివాసాన్ని కూడా ఖాళీ చేయాలంటూ ఆదేశించింది లోక్‌సభ సెక్రెటేరియట్. ఈ మేరకు ఇదివరకే నోటీసులను పంపించింది. ఎంపీ హోదాలో రాహుల్ గాంధీ- నంబర్ 12, తుగ్లక్ లేన్‌లో తనకు కేటాయించిన అధికారిక బంగళాలో ఉండేవారు. అనర్హత వేటు పడటం వల్ల తన లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయారు. దీనితో ఈ బంగళాను ఖాళీ చేయాల్సి వచ్చింది.
లోక్‌సభ సెక్రెటేరియట్ తనకు ఇచ్చిన నోటీసులకు అప్పట్లో రిప్లై కూడా ఇచ్చారాయన. బంగళాను ఖాళీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని, ఇందులో తనకు ఎలాంటి భేషజాలు లేవనీ తేల్చి చెప్పారు. నాలుగుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యానని, ఇదే బంగళాలో నివసించానని గుర్తు చేశారు. ఈ బంగళాతో తనకు మధుర జ్ఞాపకాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు.
#WATCH | Delhi: Trucks leave from Rahul Gandhi's 12 Tughlak Lane bungalow as he vacates the residence after his disqualification as a Lok Sabha MP. pic.twitter.com/CEvWhMeev9
— ANI (@ANI) April 22, 2023
రాహుల్ గాంధీ తన అధికారిక బంగళాను ఖాళీ చేయాల్సి వచ్చిన నేపథ్యంలో- దేశవ్యాప్తంగా పలువురు కాంగ్రెస్ నాయకులు ఆయనకు తమ ఇంటిని ఆఫర్ చేశారు. కాంగ్రెస్ పార్టీకే చెందిన మల్కాజ్‌గిరి లోక్‌సభ సభ్యుడు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత రేవంత్ రెడ్డి కూడా ఆయనను తన ఇంటికి ఆహ్వానించారు. తామందరం ఒకే కుటుంబ సభ్యులమని, తన ఇంట్లో ఉండాలంటూ స్వాగతం పలికారు రేవంత్ రెడ్డి.
ప్రస్తుతం ఆయన తన తల్లి సోనియాగాంధీ ఇంట్లో నివాసం ఉంటోన్నారు. ఇదివరకే కొన్ని అత్యవసర సామాగ్రిని సోనియా గాంధీ ఇంటికి తరలించారు. ఇప్పుడక్కడ మిగిలివున్న సామాన్లను కూడా పూర్తిగా తీసుకెళ్లారు. వాటన్నింటినీ సోనియా గాంధీ ఇంటికే తీసుకెళ్లారు. రెండు దశాబ్దాల పాటు ఈ బంగళాతో రాహుల్ గాంధీకి ఉన్న అనుబంధం తెగినట్టయింది.












Click it and Unblock the Notifications