ఒక్క శాతమే వ్యాట్.. విజయ్ కి థాంక్స్ చెప్పిన రామ్ మోహన్ నాయుడు
తమిళనాడులోని విజయ్ ప్రభుత్వం వైమానిక రంగానికి ఊతమిచ్చేలా ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. పెరుగుతున్న ముడిచమురు ధరలతో అతలాకుతలమవుతున్న విమానయాన సంస్థలకు భారీ ఊరటనిస్తూ విమాన ఇంధనంపై వ్యాట్ భారీగా తగ్గించింది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఊహించని రీతిలో ప్రశంసలు వెల్లువెత్తాయి. రాష్ట్రాల అభివృద్ధికి, సామాన్యులకు విమాన ప్రయాణాన్ని చేరువ చేయడానికి ఇలాంటి సమన్వయం ఎంతో అవసరమని కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కొనియాడారు. థాంక్యూ విజయ్ అంటూ ఎక్స్ లో కృతజ్ఞతలు తెలిపారు
ఈ నిర్ణయంలో భాగంగా చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన ఇంధనంపై ప్రస్తుతం ఉన్న 29 శాతం వ్యాట్‌ను ఏకంగా 16 శాతానికి తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న విమానాశ్రయాల్లో అయితే ఈ పన్నును 29 శాతం నుంచి కేవలం 1 శాతానికి తగ్గించడం విశేషం. అంతేకాకుండా 40,000 కేజీల కంటే తక్కువ బరువున్న చిన్న విమానాల కోసం వసూలు చేసే పన్నును కూడా 5 శాతం నుండి 1 శాతానికి తగ్గించారు. ఒకేసారి ఇన్ని కీలక మార్పులు చేస్తూ తమిళనాడు పారిశ్రామిక వర్గాలు, విమానయాన సంస్థలకు ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చేలా ఊరటనిచ్చింది. ఈ నూతన పన్నుల సడలింపు ఏడాది పాటు అమలులో ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.

ఎగబాకుతున్న నిర్వహణ ఖర్చులు.. విమానయాన సంస్థలకు బిగ్ రిలీఫ్
ప్రస్తుతం జీఎస్టీ పరిధిలోకి రాని విమాన ఇంధనంపై పన్నులు విధించే అధికారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకే ఉంది. అంతర్జాతీయ పరిస్థితులు, ముడిచమురు ధరల పెరుగుదల వల్ల విమాన సంస్థల నిర్వహణ వ్యయంలో ఇంధన ఖర్చుల వాటా దాదాపు 60 శాతానికి చేరింది. పైగా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ పడిపోవడం, విమానాల రవాణా మార్గాల్లో ఎదురవుతున్న సాంకేతిక సవాళ్లతో సంస్థలు తీవ్ర నష్టాల్లో కూరుకుపోతున్నాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో విజయ్ సర్కార్ తీసుకున్న నిర్ణయం వల్ల ఎయిర్‌లైన్స్ సంస్థలకు నిర్వహణ ఖర్చులు బాగా తగ్గి, కొత్త ప్రాంతాలకు విమాన సర్వీసులు ప్రారంభించేందుకు వీలు కలుగుతుంది.
సామాన్యులకు చవకైన ప్రయాణం అందుబాటులోకి వస్తుందా?
రాష్ట్రంలో కేవలం రాజధాని చెన్నైకే పరిమితం కాకుండా టైర్ టూ సిటీలకు కూడా ఫ్లైట్ కనెక్షన్స్ పెంచడం, ఆర్థిక వ్యవస్థను మరింత పరుగులు తీయించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తమిళనాడు మంత్రివర్గం పేర్కొంది. పన్నుల తగ్గింపుతో తగ్గనున్న నిర్వహణ వ్యయం వల్ల ఎయిర్‌లైన్స్ సంస్థలు టికెట్ ధరలను తగ్గించే అవకాశం ఉందని ఆశిస్తున్నారు. రాబోయే పండుగల సీజన్‌లో విమాన ప్రయాణ ధరలు అందుబాటులోకి వస్తే సామాన్య ప్రయాణికులకు ఇది నిజంగా తీపి కబురే అవుతుంది.














Click it and Unblock the Notifications
