'నా హృదయం ముక్కలైంది..విలవిల్లాడుతున్నా'
ప్రముఖ తమిళ నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్.. తమిళనాడులోని కరూర్ లో నిర్వహించిన ర్యాలీలో భారీ తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ తొక్కిసలాటలో 33 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. క్షతగాత్రులను కరూర్ లోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కరూర్ కార్నర్ మీటింగ్ కు పోలీసులు 10 వేల మందికే పర్మిషన్ ఇచ్చారు. కానీ అక్కడికి 2 లక్షల మంది వచ్చారు. అంతమందికి సరపడా స్థలం లేక తొక్కిసలాట జరిగినట్లు సమాచారం.

అయితే తాజాగా ఈ ఘటనపై తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్ స్పందించారు." నా గుండె బద్దలైపోయింది.. దుఃఖంతో నేను విలవిలలాడుతున్నాను. కరూర్‌లో ప్రాణాలు కోల్పోయిన సోదరులు, సోదరీమణుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయాలైన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను" అని ట్వీట్ చేశారు. అయితే ఈ ఘటన తర్వాత విజయ్ కరూర్ ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించకుండా నేరుగా చెన్నై వెళ్లిపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇక ఈ ఘటనపై ప్రధాని మోదీ స్పందించారు. తొక్కిసలాటపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారంతా త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్ చేశారు. అలాగే ఈ ఘటనపై తమిళనాడు సీఎం స్టాలిన్ విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు ఫ్రీగా మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
இதயம் நொறுங்கிப் போய் இருக்கிறேன்; தாங்க முடியாத, வார்த்தைகளால் சொல்ல முடியாத வேதனையிலும் துயரத்திலும் உழன்று கொண்டிருக்கிறேன்.
— TVK Vijay (@TVKVijayHQ) September 27, 2025
கரூரில் உயிரிழந்த எனதருமை சகோதர சகோதரிகளின் குடும்பங்களுக்கு என் ஆழ்ந்த அனுதாபங்களையும், இரங்கலையும் தெரிவித்துக்கொள்கிறேன். மருத்துவமனையில் சிகிச்சை…
ఈ ఘటనపై రేపు ఉదయం వరకు ప్రాథమిక రిపోర్టు అందించాలని సీఎం స్టాలిన్ ఉన్నతాధికారులను ఆదేశించారు. కరూర్ తొక్కిసలాటలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 10 లక్షల చొప్పున సాయం చేస్తామని సీఎం స్టాలిన్ వెల్లడించారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ. 1 లక్ష పరిహారం అందించనున్నట్లు తెలిపారు. అలాగే రేపు కరూర్ వెళ్లి క్షతగాత్రులను పరామర్శించనున్నారు.












Click it and Unblock the Notifications