Viral Video: టీ కొట్టు లొల్లి.. ఐపీఎస్ అని బిల్డప్ ఇచ్చి అడ్డంగా దొరికిపోయాడు!
Viral Video: సాధారణంగా ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఉన్నత పదవుల్లో ఉండే అధికారులు ప్రజలతో ఎంతో వినమ్రంగా నడుచుకుంటూ ఉంటారు. కానీ ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో మాత్రం విచిత్రంగా ఓ నకిలీ ఐపీఎస్ అధికారి పట్టుపడ్డాడు. ఓ టీ కొట్టు దగ్గర కేవలం 40 రూపాయల బన్ ప్యాకెట్ దొంగిలించి.. అడ్డంగా బుక్కై ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు. డబ్బులు అడిగినందుకు టీ కొట్టు యజమానిపైనే ఐపీఎస్ అధికారినంటూ సదరు వ్యక్తి దౌర్జన్యానికి దిగాడు.
అసలేం జరిగిందంటే..?
లక్నో వీధుల్లో తిరుగుతున్న ఓ వ్యక్తి స్థానిక టీ దుకాణానికి వెళ్లి అక్కడ ఉన్న 40 రూపాయల బన్ ప్యాకెట్‌ను తీసుకుని డబ్బులు ఇవ్వకుండా వెళ్లిపోతుండగా దుకాణదారుడు అడ్డుకున్నాడు. దాంతో ఆ వ్యక్తి తాను నోయిడా ఐపీఎస్ అధికారిని అంటూ నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే సదరు టీ దుకాణం యజమాని ఏ మాత్రం భయపడకుండా వెంటనే స్థానిక పోలీసులను సమాచారం అందించాడు. దాంతో రంగంలోకి దిగిన అసలైన పోలీసులు ఆ నకిలీ ఐపీఎస్ ఆట కట్టించారు.

ఘటనా స్థలానికి పోలీసులు రాగానే.. వైట్ టీషర్ట్, పెద్ద మీసాలతో ఉన్న ఆ నకిలీ అధికారి.. పోలీసులను మాటలతో మాయ చేయాలని ప్రయత్నించాడు. కనీస మర్యాద లేకుండా ప్రవర్తిస్తున్నారంటూ పోలీసులు సెల్యూట్ చేయమని డిమాండ్ చేశాడు. దానికి అక్కడున్న పోలీస్ కానిస్టేబుల్ గట్టి సమాధానమిస్తూ.. "నువ్వు ముందు యూనిఫామ్ వేసుకుని రా, అప్పుడు సెల్యూట్ చేస్తాం.. అయినా సివిల్ డ్రెస్‌లో ఉంటే సెల్యూట్ చేయాల్సిన అవసరం లేదు" అంటూ భారత చట్టాలు, పోలీస్ నిబంధనలను గుర్తు చేశాడు.
పోలీసులు గట్టిగా నిలదీసి ఐడీ కార్డ్ చూపించాలని అడగడంతో ఆ ఫేక్ ఐపీఎస్ అధికారి మాట మార్చాడు. "కేవలం 40 రూపాయల బన్ కోసం నేనెందుకు పారిపోతాను? ఈ టీ కొట్టు యజమాని నాకు తెలిసినవాడే" అంటూ కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత తనతో పాటు వచ్చిన మరో వ్యక్తిని పిలిచి ఆ 40 రూపాయల బిల్లు కట్టేయమని చెప్పాడు. ఈ లోపు పోలీసులు తమ మొబైల్ ఫోన్లలో ఈ తతంగాన్ని అంతా వీడియో తీస్తూ, అతడిని స్టేషన్‌కు తరలించడానికి సిద్ధపడ్డారు. పీయూష్ రాయ్ అనే వ్యక్తి ఈ వీడియోను ఎక్స్ వేదికగా షేర్ చేయడంతో ఇది కాస్తా వైరల్‌గా మారింది.
So, in Lucknow, some guy pretending to be an IPS officer from Noida swiped a bun packet worth 40 bucks from a tea stall without paying. The tea guy called the cops, and then this fake "IPS officer" actually got mad at the police for not giving him "full izzat." pic.twitter.com/YECf0kIWqo
— Piyush Rai (@Benarasiyaa) June 15, 2026
ఈ వీడియో చూసిన నెటిజన్లు నకిలీ ఐపీఎస్ అధికారిపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు."అసలైన ఐపీఎస్ అధికారులు తమ బిజీ షెడ్యూల్ పక్కన పెట్టి ఇలా కిరాణా కొట్టు, టీ కొట్ల దగ్గరకు వచ్చి చిల్లర గొడవలు పెట్టుకోరు" అని కామెంట్లు పెడుతున్నారు. ఇలాంటి ప్రయాసల ద్వారా సమాజంలో అరాచకాలు సృష్టిస్తున్న నకిలీ అధికారులకు పోలీసులు గట్టి బుద్ధి చెప్పాలని, ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications