రోహింగ్యాలకు సువేందు భారీ షాక్
పశ్చిమ బెంగాల్ లో అధికార మార్పిడి అనంతరం అనేక పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీకి వరుస షాకులను ఇస్తోందక్కడి ముఖ్యమంత్రి సువేందు అధికారి సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఇప్పటికే ఈడీ, ఐటీ దాడులు జరుగుతున్నాయక్కడ. వ్యతిరేకంగా ప్రచారం చేసిన సెలెబ్రెటీలను కూడా వదలట్లేదు. కేసులు నమోదవుతున్నాయి.
ఈ పరిణామాల మధ్య పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. రాష్ట్రంలో అక్రమంగా నివసిస్తున్న విదేశీ పౌరుల డిపోర్టేషన్ చేపట్టింది. రాష్ట్రంలో నివసిస్తోన్న రోహింగ్యా శరణార్థులను స్వదేశాలకు పంపడానికి ఏర్పాట్లు చేపట్టింది. అక్రమంగా నివసిస్తోన్న బంగ్లాదేశీయులను కూడా వారి దేశానికి పంపించనుంది. దీనికోసం రాష్ట్రంలో ప్రత్యేక హోల్డింగ్ కేంద్రాలను నిర్మించాలని ఆదేశాలు జారీ చేసింది.

ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు లిఖితపూర్వక ఆదేశాలు అందాయి. హోల్డింగ్ సెంటర్ల నిర్మాణం, వారి డిపోర్టేషన్ కు సంబంధించిన, మార్గదర్శకాలు సైతం ఇందులో ఉన్నాయి. అన్ని జిల్లాల కలెక్టర్లు తమ పరిధిలో ఈ కేంద్రాల నిర్మాణానికి అనువైన స్థలాలను గుర్తించి, పనులను త్వరగా ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించింది. వారందరినీ కూడా హోల్డింగ్ సెంటర్లకు తరలించాలి. చిట్టచివరి వ్యక్తం కూడా హోల్డింగ్ సెంటర్ కు చేరిన తర్వాత స్వదేశానికి పంపించాలని ఆదేశించింది ప్రభుత్వం.
అక్రమ వలసదారులు ఎక్కువగా ఉండే బంగ్లాదేశ్ సరిహద్దు జిల్లాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ హోల్డింగ్ కేంద్రాల ముఖ్య లక్ష్యం అక్రమంగా నివసిస్తున్న వారిపై కఠిన నిఘా ఉంచడమే. అక్రమ బంగ్లాదేశీయులు, రోహింగ్యా చొరబాటుదారులను నేరుగా జైలులో కాకుండా ఈ ప్రత్యేక కేంద్రాలకు తరలిస్తారు. వారి గుర్తింపు నిర్ధారణ, స్వదేశాలకు చట్టబద్ధంగా తిరిగి పంపే ప్రక్రియ పూర్తయ్యే వరకు ఇక్కడే పర్యవేక్షణలో ఉంచుతారు.
తాము అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో అక్రమ చొరబాటుదారులందరినీ కూడా స్వదేశానికి పంపిస్తామని ఎన్నికల ప్రచార సమయంలో హామీ ఇచ్చింది బీజేపీ. దీనికి అనుగుణంగా అక్కడి బీజేపీ ప్రభుత్వం తాజా చర్యలు చేపట్టింది. ఈ డిపోర్టేషన్ చర్యలన్నింటినీ కూడా కేంద్ర హోం, విదేశాంగ మంత్రిత్వ శాఖలు పర్యవేక్షించే అవకాశం ఉంది. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హామీని నెరవేర్చడంలో నిమగ్నమైంది.












Click it and Unblock the Notifications